Yanamala Ramakrishnudu: రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏదైనా జరిగితే సీఎం జగన్, జైలు అధికారులదే బాధ్యత అని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు హెచ్చరించారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితులపై డాక్టర్లు కాకుండా డిప్యూటీ సూపరింటెండెంట్ ఎలా హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారని ప్రశ్నించారు. రాజమండ్రి క్యాంప్ సైట్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ ఇచ్చిన నివేదికలో ఏముంది.? ఏ రిపోర్టులు చూసి ఆరోగ్యం బాగుందని బులిటెన్ బయటకు ఇచ్చారు.? చేయాల్సిన కనీస పరీక్షలు చేయలేదు.. రక్త పరీక్ష కూడా చేయలేదు. ఆరోగ్యం బాగోలేకనే చర్మంపై దద్దుర్లు, అలర్జీ వచ్చింది. చంద్రబాబు ఆరోగ్యంపై మొదటి నుండీ ప్రభుత్వం, అధికారులు తప్పుడు సమాచారం బయటకు ఇస్తున్నారని ఆరోపించారు.
హెల్త్ బులిటెన్ ఇచ్చినప్పుడు సంబంధిత అధికారులు విడుదల చేయాలి.. కానీ, జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ విడుదల చేస్తున్నాడు? ఇదేంటి అని ప్రశ్నించారు యనమల.. డాక్టర్లు పరిశీలించినట్లుగా హెల్త్ బులెటిన్ లో లేదు. చంద్రబాబు ముద్దాయి అన్న పదం వాడారు తప్ప డాక్టర్లు పరీక్షలు చేసినట్లు బులెటిన్‌లో లేదు. డిప్యూటీ సూపరింటెండెంట్ తన సొంతంగా లేఖ రాసి బయటకు వదిలారు. డాక్టర్లు పరీక్షలు చేసిన రిపోర్టులు ఎక్కుడున్నాయి..? డాక్టర్ రిలీజ్ చేసిన మెడికల్ రిపోర్టు బయటపెట్టాలి.. కానీ, పెట్టలేదని అన్నారు. జైలులో చంద్రబాబు ఉండే రూమ్, అక్కడి పరిసర ప్రాంతం సరిగా లేకపోవడం వల్ల అనారోగ్య సమస్య వచ్చింది. ఓవర్ హెడ్ ట్యాంక్ కు బోరు నీళ్లు వెళ్తాయి.. ఆ ట్యాంకు శుభ్రం చేస్తున్నారో లేదో తెలీదు. అలాంటి నీళ్లతో చంద్రబాబు స్నానం చేయాల్సి వస్తోందని మండిపడ్డారు.
చంద్రబాబు జాతీయ స్థాయి నేత.. ఆయన గురించి ప్రభుత్వం తప్పకుండా ఆలోచించాలి అని యనమల అన్నారు. తప్పుడు కేసులు.. తప్పుడు సాక్ష్యాలతో అకారణంగా చంద్రబాబును ఇరికించారు. డాక్టర్లపై ఒత్తిడి తెచ్చి చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఉన్నది ఉన్నట్లు చెప్పడంలేదు. 5 కేజీల బరువు తగ్గారు.. మరో 2 కేజీలు తగ్గితే కిడ్నీ సమస్య తలెత్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.. ఈ వయసులో చంద్రబాబును ఇలాంటి కష్టాలు పెట్టడాన్ని ఖండిస్తున్నాం. ఆరోపణలు ఎదుర్కొనే వ్యక్తి అనారోగ్య సమస్యలతో బాధ పడితే తక్షణమే ఆసుపత్రిలో చేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. డస్ట్ ఎలర్జీ చంద్రబాబుకు ఉంది. డీఐజీకి ఏం చెప్పినా తమకు పై నుండి ఒత్తిడి ఉందని చెప్తున్నారు. ప్రాక్టీసింగ్ లాయర్ గా నేను చంద్రబాబుతో ములాకత్ కు వెళ్లొచ్చు.. కానీ, నన్ను అనుమతించడం లేదు. నా అర్హత సర్టిఫికేట్ ఇచ్చినా ఒప్పుకోవడం లేదని అన్నారు. ఆరోగ్య సమస్యలో చంద్రబాబు ఉన్నారు.. ఆయనకు పూర్తిగా పరీక్షలు చేయాల్సి ఉంది. చంద్రబాబు అనారోగ్యంపై లీగల్ గా కూడా వ్యవహరిస్తాం. డాక్టర్లు ఇచ్చిన రిపోర్టులు కూడా మార్పులు చేసి సొంత రిపోర్టులు చేస్తున్నారని ఆరోపించారు..
చంద్రబాబును సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్చి.. కోలుకునేదాకా డాక్టర్ల సమక్షంలో ఉంచాలి.. అవసరమైతే పోలీసుల సమక్షంలోనే ఉంచుకోవాలని డిమాండ్ చేశారు యనమల.. అనారోగ్యం ఇలాగే ఉంటే లివర్, హార్ట్ పై ప్రభావం ఉంటుంది. ప్రైవేట్ డాక్టర్లను సంప్రదించగా సీరియస్ అంశంగా చెప్పారని తెలిపారు. గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లో అనారోగ్యంతో ఉన్నప్పుడు వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. ఇక్కడి వాతావరణ పరిస్థితుల వల్ల చంద్రబాబు ఉండే గదిలో ఫ్యాన్ వేసినా ఇంకా వేడి పెరుగుతుంది.. డస్ట్ వల్ల ఇంకా ఎలర్జీ పెరిగే అవకాశం ఉంది. వాళ్లు ఏం మందులు ఇచ్చారో కూడా తెలీదు.. కనీసం వ్యక్తిగత డాక్టర్లకు కూడా సమాచారం ఇవ్వలేదు. ఏం మందులు ఇచ్చారో అనుమానం ఉందన్నారు.. చంద్రబాబు వద్దకు వ్యక్తిగత డాక్టర్లను అనుమతించాలని కోరారు. రూల్ ప్రకారం లోకల్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ జైలును సందర్శించవచ్చు.. కానీ, అనుమతించడం లేదు అంటూ మండిపడ్డారు యమనల రామకృష్ణుడు.