NTV Telugu Site icon

Champions Trophy 2025: హైబ్రిడ్‌ మోడల్‌లో ఛాంపియన్స్‌ ట్రోఫీ.. 2027వరకు తటస్థ వేదికలే!

Champions Trophy 2025 In Hybrid Model

Champions Trophy 2025 In Hybrid Model

గత కొన్ని నెలలుగా ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 నిర్వహణపై నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆతిథ్యమివ్వనున్న ఛాంపియన్స్‌ ట్రోఫీని హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహించనున్నట్లు గురువారం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించింది. టీమిండియా మ్యాచ్‌లు తటస్థ వేదికలో జరుగుతాయని ఐసీసీ పేర్కొంది. 2027 వరకు భారత్‌లో జరిగే ఐసీసీ టోర్నీ మ్యాచ్‌లను పాకిస్తాన్ కూడా తటస్థ వేదికలో ఆడనుంది.

‘2024-2027 మధ్యలో భారత్, పాకిస్తాన్ దేశాల్లో జరిగే ఐసీసీ టోర్నీల్లో ఇరు జట్లు తలపడే మ్యాచ్‌లు తటస్థ వేదికలో జరుగుతాయి. ఆతిథ్య దేశం తటస్థ వేదికను ఎంపిక చేస్తుంది. ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 షెడ్యూల్‌ త్వరలోనే రిలీజ్ అవుతుంది’ అని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ ఆడే మ్యాచ్‌లకు యూఏఈ వేదికగా నిలవనుందని ఐసీసీ వర్గాలు తెలిపాయి. భారత్‌లో వచ్చే ఏడాది జరిగే మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమిండియాతో పాకిస్తాన్ ఆడే మ్యాచ్‌కు శ్రీలంక ఆతిథ్యం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న 2026 టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాతో పాక్ ఆడే మ్యాచ్‌ లంకలో జరిగే అవకాశాలు ఉన్నాయి.

పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనున్న 2028 మహిళల టీ20 ప్రపంచకప్‌లో కూడా ఇదే పద్ధతిని అవలంబించే అవకాశం ఉన్నా.. ఐసీసీ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. 2025 ఫిబ్రవరి 19న ప్రారంభం కావాల్సిన ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాకిస్థాన్‌లో మ్యాచ్‌లను ఆడేందుకు భారత్ నిరాకరించడంతో అనిశ్చితి నెలకొంది. ఐసీసీ చర్చల అనంతరం పీసీబీ హైబ్రిడ్‌ మోడల్‌కు ఒప్పుకుని.. తాము కూడా ఐసీసీ మ్యాచ్‌లను భారత్‌లో ఆడమని కండిషన్ పెట్టింది. బీసీసీఐ, పీసీబీలతో చర్చల అనంతరం ట్రోఫీ అనిశ్చితికి ఐసీసీ తెరదించింది. త్వరలోనే షెడ్యూల్ రిలీజ్ కానుంది.

Show comments