ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో నేడు మరో ఆసక్తికర సమరం జరగనుంది. సెమీ ఫైనల్ బెర్తు కోసం ఆస్ట్రేలియాతో అఫ్గానిస్థాన్ తలపడనుంది. గత మ్యాచ్‌లో పటిష్ట ఇంగ్లండ్‌కు షాకిచ్చిన అఫ్గాన్.. మరో సంచలన విజయం సాదిస్తుందేమో చూడాలి. 2024 టీ20 ప్రపంచకప్‌లో అఫ్గాన్ చేతిలో ఆస్ట్రేలియా ఓడింది. అంతేకాదు గతేడాది టీ20 ప్రపంచకప్‌లో సెమీస్ చేరిన అఫ్గాన్‌కు.. వరుసగా రెండో ఐసీసీ సెమీస్ చేరే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని అఫ్గానిస్థాన్ ఒడిసిపడుతుందో లేదో మరి.
ఇంగ్లండ్‌పై సెంచరీ చేసిన ఇబ్రహీం జద్రాన్.. 5 వికెట్లు తీసిన అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌లు ఆస్ట్రేలియా మ్యాచ్‌లో కీలకం కానున్నారు. ఈ ఇద్దరు మరోసారి చెలరేగితే అఫ్గాన్‌కు ఎదురుండదు. హష్మతుల్లా, గుర్బాజ్, నబీ, గుల్బదిన్, రషీద్ ఖాన్ కూడా మంచి ప్రదర్శన చేస్తే.. ఆస్ట్రేలియాకు కష్టాలు తప్పవు. దక్షిణాఫ్రికాతో రెండో మ్యాచ్ వర్షంతో రద్దు కావడంతో.. అఫ్గాన్‌తో మ్యాచ్ కంగారులకు క్వార్టర్ ఫైనల్‌గా మారింది. ఎలాగైనా సెమీఫైనల్లో అడుగుపెట్టాలని కృతనిశ్చయంతో ఉంది. బౌలింగ్‌తో పోలిస్తే బ్యాటింగ్‌లో ఆసీస్ బలంగా ఉంది. హెడ్, స్మిత్, లబుషేన్, మ్యాక్స్‌వెల్ లాంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు.
లాహోర్‌లో మ్యాచ్ మధ్యాహ్నం 2.30కు ఆరంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. లాహోర్ పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలం. రెండు మ్యాచులలో నాలుగుసార్లు 300 పైచిలుకు స్కోరు నమోదైంది. ఈ నేపథ్యంలో మరో భారీ స్కోరు ఆశించవచ్చు. ఈ మ్యాచుకు భారీ వర్ష సూచన కూడా ఉంది. ఒకవేళ మ్యాచ్ జరగకుంటే మాత్రం అఫ్గానిస్తాన్ కథ ముగుస్తుంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సెమీస్‌కు అర్హత సాధిస్తాయి.
తుది జట్లు (అంచనా):
ఆ్రస్టేలియా: స్టీవ్ స్మిత్ (కెప్టెన్ ), షార్ట్, హెడ్, లబుషేన్, జోస్ ఇన్‌గ్లిస్, అలెక్స్ కేరీ, మ్యాక్స్‌వెల్, డ్వార్షుయిస్, నాథన్ ఎలిస్, ఆడమ్ జంపా, జాన్సన్.
అఫ్గానిస్తాన్: హష్మతుల్లా (కెప్టెన్ ), గుర్బాజ్, ఇబ్రహీమ్ జద్రాన్, సిద్ధిఖుల్లా, రహ్మత్ షా, అజ్మతుల్లా ఒమర్జాయ్, నబీ, గుల్బదిన్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఫజల్‌హక్.