Women Died with Heart Attack while boarding the Plane in Chandigarh: నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చిన్ననారాయణపురం సర్పంచి కె నర్సింహా భార్య ఇందిరాబాయి (48) ఛండీగఢ్‌లో మరణించారు. డ్వాక్రా ఉద్యోగిని అయిన ఇందిరాబాయి ఛండీగఢ్‌లో విమానం ఎక్కే క్రమంలో గుండెపోటు రావడంతో శుక్రవారం మృతి చెందారు. ఇందిరాబాయి మృతదేహాన్ని చిన్ననారాయణపురానికి తరలించడానికి హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ చర్యలు తీసుకున్నారు. ఆదివారం రాత్రి మృతదేహం ఆమె స్వగ్రామానికి చేరుకోగా.. సోమవారం అంత్యక్రియలు జరగనున్నాయి.
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఇందిరాబాయి స్థానికంగా సీఆర్‌పీగా విధులు నిర్వహిస్తుంటారు. పంజాబ్‌లో సీఆర్‌పీకు నెల రోజుల పాటు నిర్వహించే అవగాహన సదస్సుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన 400 మందిలో ఇందిరాబాయి ఉన్నారు. పంజాబ్‌లో ఇందిరాబాయి సదస్సులు ముగించుకుని.. తిరిగి హైదరాబాద్‌కు ప్రయాణమయ్యారు. ఛండీగఢ్‌లో విమానం ఎక్కుతుండగా.. ఆమెకు గుండెపోటు వచ్చింది. సిబ్బంది వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు.
Also Read: Train Accident: విజయనగరం రైలు ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి.. బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు!
ఇందిరాబాయి మరణ వార్తను పంజాబ్ అధికారులు కుటుంబ సభ్యులకు చెప్పగా.. వారు హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన హరియాణా గవర్నర్ ఇందిరాబాయి మృతదేహాన్ని చిన్ననారాయణపురానికి తరలించడానికి చర్యలు తీసుకున్నారు. దత్తాత్రేయ చొరవతో ఆదివారం రాత్రి ఇందిరాబాయి మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. నేడు ఆమె అంత్యక్రియలు కుటుంబ సభ్యులు నిర్వహించనున్నారు.