NTV Telugu Site icon

Apple Devices: మీరు యాపిల్ డివైజ్‌లు వాడుతున్నారా?.. ఈ అలర్ట్‌ మీకోసమే!

Applestores

Applestores

అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ ‘యాపిల్‌’కు చెందిన ఐఫోన్స్‌, మ్యాక్స్‌, యాపిల్‌ వాచీలు వాడుతున్న వారిని కేంద్రం అలర్ట్‌ చేసింది. ఔట్‌ డేటెడ్‌ సాఫ్ట్‌వేర్‌ వాడుతున్న డివైజుల్లో సెక్యూరిటీ లోపాలు ఉన్నట్లు గుర్తించింది. ఈ లోపాలను అత్యంత తీవ్రమైనవిగా పేర్కొంది. ఈ మేరకు కేంద్ర సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ ‘కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ ఆఫ్‌ ఇండియా’ (సెర్ట్‌-ఇన్‌) ఓ అడ్వైజరీని జారీ చేసింది. సైబర్‌ నేరగాళ్లు డివైజుల్లోని సున్నితమైన సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉందని హెచ్చరించింది.

పాత సాఫ్ట్‌వేర్‌లో సెక్యూరిటీ లోపాల కారణంగా.. యాపిల్‌ డివైజుల్లో నేరగాళ్లు అక్రమంగా చొరబడి సెన్సిటివ్‌ డేటాను యాక్సెస్‌ చేయడం లేదా డేటా మానిప్యులేషన్‌కు పాల్పడే అవకాశం ఉందని సెర్ట్‌-ఇన్‌ పేర్కొంది. ఐఓస్‌ 18.1 కంటే ముందు వెర్షన్‌ లేదా 17.7.1 కలిగిన ఐఫోన్లు, ఐప్యాడ్‌ ఓస్‌ 18.1 కంటే ముందు లేదా 17.7.1 వెర్షన్‌ కలిగిన ఐప్యాడ్‌లు, పాత మ్యాక్‌ ఓఎస్‌ వాడుతున్న మ్యాక్‌లు, వాచ్‌ ఓఎస్‌ 11 కంటే ముందు సాఫ్ట్‌వేర్‌ కలిగిన వాచ్‌లకు ఈ ప్రమాదం పొంచి ఉందని సెర్ట్‌-ఇన్‌ తెలిపింది. పాత టీవీఓఎస్‌, విజన్‌ఓఎస్‌, సపారీ బ్రౌజర్లకూ ఈ ముప్పు పొంచిఉంది.

పాత సాఫ్ట్‌వేర్‌లో లోపాలను యాపిల్‌ ఇదివరకే గుర్తించి… కొత్త సెక్యూరిటీ అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. ఎవరైతే పాత సాఫ్ట్‌వేర్‌ వెర్షన్లు వాడుతున్నారో వారు వెంటనే తమ డివైజ్‌లను అప్‌డేట్‌ చేసుకోవాలని యాపిల్‌ సూచించింది. లోపాల నుంచి డివైజులను సురక్షితంగా ఉంచుకునేందుకు యూజర్లు ఎప్పటికప్పుడు సెక్యూరిటీ ప్యాచ్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని తెలిపింది. ఆండ్రాయిడ్‌ ఫోన్‌లను వినియోగిస్తున్న వారికి కూడా సెర్ట్‌-ఇన్‌ హెచ్చరిస్తుందన్న విషయం తెలిసిందే.

Show comments