జీఎస్టీ పరిహారం బదులుగా రుణాలను విడుదల చేసింది కేంద్రం. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కలిపి 44 వేల కోట్లు రిలీజ్ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 1.59 లక్షల కోట్లు విడుదల చేసింది కేంద్రం.కరోనా సెకండ్‌వేవ్, లాక్‌డౌన్‌తో రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. సగానికి సగం ఆదాయం పడిపోయింది. ఆ సంక్షోభం నుంచి బయటపడేందుకు రాష్ట్రాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టాయ్. ఐతే రాష్ట్రాలకు ఊతం ఇచ్చేందుకు ముందుకొచ్చింది కేంద్రం.
జీఎస్టీ నష్టపరిహారం భర్తీకి బదులు రుణం క్రింద 44వేల కోట్లను విడుదల చేసింది. ఇందులో తెలంగాణకు 12వందల 64.78 కోట్లు, ఏపీకి 905.59 కోట్లు ఉన్నాయ్. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం విడుదల చేసిన రుణాల మొత్తం 1.59 లక్షల కోట్లకు చేరింది. జూలై 15న 75వేల కోట్లు; అక్టోబరు 7న 40వేల కోట్లు రుణంగా విడుదల చేసింది. గురువారం 44వేల కోట్లు విడుదల చేసింది. 2021 మే 28న జరిగిన జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో ఈ రుణాలను నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం 1.59 లక్షల కోట్లు అప్పు చేసి, దానిని రాష్ట్రాలు, చట్ట సభ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాలకు బ్యాక్-టు-బ్యాక్ ప్రాతిపదికపై రుణంగా అందజేయాలని తీర్మానం చేశారు. జీఎస్‌టీ కంపెన్సేషన్ ఫండ్‌కు వసూలైన నిధులు తగ్గడంతో నష్టపరిహారం భర్తీలో లోటు ఏర్పడింది. దాంతో ఆ లోటును భర్తీ చేయడం కోసం రుణాలను ఇస్తోంది కేంద్రం.
