Site icon NTV Telugu

IndiGo: ఇండిగోపై చర్యలు తీసుకుంటాం..: కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు

Rammohan Naidu

Rammohan Naidu

IndiGo: పార్లమెంట్‌లో పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ఇండిగోపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించే ఏ సంస్థను ఉపేక్షించబోమని, ప్రజల భద్రత విషయంలో ఎలాంటి బేరసారాలు ఉండవని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండిగోకి DGCA నోటీసులు జారీ చేసిందని, ప్రయాణికుల భద్రతే ప్రభుత్వానికి ముఖ్యం అని, ప్రస్తుత పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని అన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని DGCAను ఆదేశించినట్లు తెలిపారు. ఇప్పటికే ఇండిగో సీఈవో, సీవోవోకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. అలాగే ప్రయాణికులకు రూ.750 కోట్లను వెనక్కి ఇప్పించామని వెల్లడించారు.

READ ALSO: Telangana Rising Global Summit: గ్లోబల్ సమ్మిట్‌లో పలు కంపెనీలతో ప్రభుత్వం పెట్టుబడులు.

ఆయన మాట్లాడుతూ.. క్రమంగా ఎయిర్‌పోర్టుల్లో పరిస్థితులు సాధారణస్థితికి వస్తున్నాయని అన్నారు. ఇప్పటికే ప్రయాణికులకు రిఫండ్, లగేజీలను చేర్చే ప్రయత్నాలు స్టార్ట్ అయ్యాయని, డీజీసీఏ ఇండిగో యాజమాన్యానికి ఇప్పటికే షోకాజ్ నోటీసులు ఇచ్చిందని అన్నారు. ప్రయాణికుల భద్రత విషయంలో ఎలాంటి బేరసారాలు ఉండవని స్పష్టం చేశారు.

ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్‌‌పై ఆయన స్పందిస్తూ.. ఈ సంస్కరణలు ప్రయాణికుల భద్రతను పెంచుతాయని, అలాగే పైలట్ల అలసటను దృష్టిలోపెట్టుకొని శాస్త్రీయ పద్ధతుల్లో వీటిని రూపొందించినట్లు పేర్కొన్నారు. వాస్తవానికి డీజీసీఏ ముందుగా అన్ని విమానయాన సంస్థలతో మాట్లాడిన తర్వాతే ఈ సంస్కరణలను క్రమక్రమంగా అమలు చేస్తోందని వివరించారు. 2025 జులై ఒకటి నుంచి తొలి దశ, నవంబర్ ఒకటి నుంచి రెండో సంస్కరణలను అమలుచేస్తున్నట్లు ఆయన తెలిపారు. నిజానికి ఈ నిబంధనలను ఇండిగో కూడా పాటిస్తామని హామీ ఇచ్చిందని వెల్లడించారు. అయితే ఇండిగో హామీ మాత్రం ఇచ్చిందని కానీ, ఈ సంస్థ రోస్టరింగ్ నియమాలను అమలు చేయడంలో విఫలం కావడంతో దీని ఫలితం ఆ సంస్థ సర్వీసుల రద్దుకు కారణం అయినట్లు ప్రభుత్వం గుర్తించినట్లు తెలిపారు. విమానయాన రంగంలో గుత్తాధిపత్యానికి కేంద్రం తావివ్వడం లేదని, మరిన్ని విమానయాన సంస్థలను ఈ రంగంలోకి ఆహ్వానిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ రంగంలోకి కొత్త సంస్థలు అడుగుపెట్టడానికి ఇదే మంచి టైం అని మరోసారి ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం వెనక ప్రజాప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఇండిగో సర్వీసులు రద్దు అయిన టైంలో మిగిలిన విమానాల టికెట్ ఛార్జీలపై పరిమితులు విధించామని ఆయన గుర్తుచేశారు.

READ ALSO: Hardik Pandya: వారికి హార్దిక్ పాండ్యా సీరియస్ వార్నింగ్..

Exit mobile version