Site icon NTV Telugu

Andhra Pradesh: ఏపీ రహదారుల అభివృద్ధికి రూ.252.42 కోట్లు

Ap Roads

Ap Roads

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో రూ.252.42 కోట్లు విలువ చేసే రహదారి పనులకు కేంద్రం ఆమోదం లభించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎక్స్‌ వేదికగా ప్రకటించారు. ఇందులో రణస్థలం నుంచి శ్రీకాకుళం వరకు ఆరు లైన్ల ఎలివేటెడ్ కారిడార్ అభివృద్ధి, ఆధునికీకరణ గురించి కూడా ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల పలు చోట్ల ట్రాఫిక్ సమస్యలు తీరడంతో పాటు రహదారి భద్రత పెరుగుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. అలాగే ఆర్థిక, సామాజిక అవకాశాలు పెరుగుతాయని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టుతో చాలా మందికి ఉపాధి కూడా లభిస్తుందని వెల్లడించారు. తద్వారా ఆ ప్రాంతానికి చెందిన వారి జీవితాలు మెరుగుపడతాయన్నారు.

Read Also: Amaravati Railway Line: అమరావతి రైల్వేలైన్‌కు కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్

మరోవైపు అమరావతి రైల్వే లైన్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. 57 కిలోమీటర్ల పొడవున కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. రూ. 2,245 కోట్లతో రైల్వే లైన్ నిర్మాణం చేపట్టేందుకు ఆమోదం లభించింది. కృష్ణానదిపై 3.2 కిలోమీటర్ల మేర రైల్వే వంతెన నిర్మాణానికి కూడా ఆమోదం లభించింది. ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు రైల్వే లైన్ నిర్మించేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతికి హైదరాబాద్‌-చెన్నై-కోల్‌కతాతో రైల్‌ కనెక్టివిటీ రానుంది. ఇప్పటికే ఈ రైల్వే లైన్‌కు సంబంధించి ప్రణాళికను కూడా సిద్ధం చేశారు. రాష్ట్ర రాజధానికి అమరావతికి రవాణా కనెక్టివిటీని పెంచి అభివృద్ధి దిశగా అడుగులు వేసేందుకు ప్రణాళిక సిద్ధమవుతోంది. అమరావతి రైల్వే లైన్‌లో పలు గ్రామాలకు కూడా రైల్వే కనెక్టివిటీ రానుంది. ఈ నిర్ణయంతో అమరావతి అభివృద్ధి దిశగా దూసుకెళ్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

అమరావతికి రైల్వే లైన్‌ ఇచ్చినందుకు ప్రధానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రైల్వే లైన్‌తో దేశంలోని అన్ని నగరాలకు అమరావతి కనెక్ట్‌ అవుతుందన్నారు. నాలుగేళ్లలో ఈ రైల్వే లైన్ పూర్తవుతుందన్న ఆయన.. మూడేళ్లలోనే పూర్తి చేస్తే ఎంతో ఉపయోగకరమన్నారు. భూసేకరణకు అవసరమైన అన్ని చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మించాలని కోరుతున్నామన్నారు. వచ్చే నెలలో ఈ రైల్వే లైన్ ప్రాజెక్ట్ శంకుస్థాపనకు ప్రధానిని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. విశాఖపట్నం రైల్వే జోన్‌ చాలా రోజులుగా పెండింగ్‌లో ఉందని సీఎం పేర్కొన్నారు.

Exit mobile version