Central Government Funds: పండుగల సీజన్లో రాష్ట్రాలకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలకు భారీగా నిధులు విడుదల చేసింది. సాధారణంగా నవంబర్ 10న విడుదల చేయాల్సిన నెలవారీ పన్నుల వాటా నిధులను ఐదు రోజుల ముందుగానే నవంబర్ 5న విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 28 రాష్ట్రాలకు కలిపి రూ.1,09,019 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. పండుగల సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక వెసులుబాటు కల్పించడంతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అవసరమైన నిధులను అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా రాష్ట్రాలు మూలధన వ్యయాలను (Capital Expenditure) వేగవంతం చేసేందుకు ఈ నిధులు ఉపయోగపడనున్నాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత లేకుండా చూడాలని కేంద్రం భావిస్తోంది.
ఏపీకి రూ.4,597 కోట్లు.. తెలంగాణకు రూ.2,370 కోట్లు
కేంద్రం విడుదల చేసిన నిధుల్లో ఆంధ్రప్రదేశ్‌కు రూ.4,597 కోట్లు కేటాయించింది. తెలంగాణ రాష్ట్రానికి రూ.2,370 కోట్లు విడుదల చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కలిపి మొత్తం రూ.6,967 కోట్ల నిధులు అందనున్నాయి. ఈ నిధులతో రెండు రాష్ట్రాలు తమ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు మూలధన వ్యయాలను పెంచుకునే అవకాశం ఉంది.
యూపీకి అత్యధికంగా రూ.19,208 కోట్లు
రాష్ట్రాల వారీగా చూస్తే దేశంలోనే అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌కు రూ.19,208 కోట్లను కేంద్రం విడుదల చేసింది. బీహార్‌కు రూ.10,845 కోట్లు కేటాయించింది. ఇలా మొత్తం 28 రాష్ట్రాలకు రూ.1,09,019 కోట్ల పన్నుల వాటా నిధులను ముందస్తుగా విడుదల చేయడం ద్వారా రాష్ట్రాల ఆర్థిక అవసరాలకు కేంద్రం మద్దతు అందించింది. సాధారణ షెడ్యూల్ కంటే ఐదు రోజుల ముందుగానే నిధులు విడుదల చేయడంతో పండుగల సీజన్లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థికంగా ఊరట లభించనుంది. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుకు ఈ నిధులు ఎంతగానో దోహదపడనున్నాయి.

