NTV Telugu Site icon

Pawan Kalyan: రాష్ట్రంలో 11 నగర వనాల అభివృద్ధికి కేంద్రం నిధులు మంజూరు

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: రాష్ట్రంలో నగరాలు, పట్టణ ప్రాంతాల్లో నగర వనాలు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ ఆమోదం తెలియజేసిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. 11 మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల పరిధిలో నూతనంగా నగర వనాలు అభివృద్ధి నిమిత్తం తొలి విడతగా రూ.15.4 కోట్లను కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నిధులను మంజూరు చేసిందని తెలిపారు. ఈ నిధులతో కర్నూలులో గార్గేయపురం నగర వనం, కడప నగర వనం, నెల్లిమర్లలో వెలగాడ నగర వనం, చిత్తూరు డెయిరీ నగర వనం, చిత్తూరులో కలిగిరి కొండ నగర వనం, శ్రీకాళహస్తిలో కైలాసగిరి నగర వనం, తాడేపల్లిగూడెంలో ప్రకాశరావుపాలెం నగర వనం, పెనుకొండలో శ్రీకృష్ణదేవరాయ కోట ఎకో పార్క్ నగర వనం, కదిరిలో బత్రేపల్లి వాటర్ ఫాల్స్ ఎకో పార్క్ నగరవనం, పలాసలో కాశీబుగ్గ నగర వనం, విశాఖపట్నంలో ఈస్టర్న్ ఘాట్ బయోడైవర్సిటీ సెంటర్ నగర వనాలను అభివృద్ధి చేస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు.

Read Also: Andhra Pradesh: బదిలీలకు గైడ్ లైన్స్ జారీ చేస్తున్న వివిధ శాఖలు

ఈ సందర్భంగా రాష్ట్రంలో అటవీ శాఖ అధికారులతో చర్చించారు. నగర వనాలకు సంబంధించిన పనులపై ప్రస్తుతం రాష్ట్రంలో 50 నగర వనాల అభివృద్ధి వేగంగా పనులు సాగుతున్నాయనీ, రాబోయే 100 రోజుల్లో 30 నగర వనాల పనులు పూర్తి కావస్తాయని అధికారులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. కేంద్రం నుంచి వస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించే అవకాశాలు లభించాయని పవన్‌కల్యాణ్ తెలిపారు. రాష్ట్రంలో పచ్చదనం 50శాతం మేరకు ఉండాలని, ఇందులో భాగంగా నగర వనాలు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు.

30వ తేదీన వన మహోత్సవం
ఈ నెల 30వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని, ఇందులో ప్రజలు, ముఖ్యంగా యువత భాగస్వామ్యాన్ని పెంచాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రతి గ్రామం, పట్టణం, నగరంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒక వేడుకలా చేయాలని, ప్రభుత్వ శాఖలతోపాటు అన్ని విద్యా సంస్థలు, విశ్వ విద్యాలయాలు, పరిశ్రమలు, పేపర్ మిల్లులు, అధ్యాత్మిక సంస్థలు.. అన్నింటినీ ఇందులో పాలుపంచుకొనేలా చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.