NTV Telugu Site icon

Corona Virus: కరోనాపై కేంద్రం హై అలర్ట్.. ఎల్లుండి రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్

Corona

Corona

Corona Virus: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యం కేంద్ర హైఅలర్ట్ ప్రకటించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కొవిడ్ అలర్ట్ జారీ చేసింది. కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఎల్లుండి(సోమవారం) రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్య శాఖ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నుట్లు తెలుస్తోంది. అలాగే.. ఏప్రిల్‌ 10, 11వ తేదీల్లో కరోనాపై కేంద్రం మాక్‌ డ్రిల్‌ నిర్వహించనుంది. గుజరాత్‌, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకలో భారీగా కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రధాని అధ్యక్షతన బుధవారం ఉన్నత స్థాయి సమావేశం జరిగిన విషయం తెలిసిందే.

Read Also: ISRO: ఆదివారం నింగిలోకి దూసుకెళ్లనున్న ఎల్వీఎం-3 రాకెట్.. కొనసాగుతున్న కౌంట్‌డౌన్‌

ఇదిలా ఉండగా.. గడిచిన 24 గంటల్లో 1,590 తాజా కొవిడ్‌-19 కేసులు నమోదు అయ్యాయి. భారతదేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 8,601కి పెరిగింది. గత 146 రోజుల్లో నమోదైన అత్యధిక కేసులు ఇవేనని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతదేశంలో గత కొన్ని రోజులుగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇది ఆరోగ్య శాఖ అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. గత 24 గంటల్లో మరో ఆరు కోవిడ్ -19 మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్ర నుండి ముగ్గురు, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరాఖండ్ నుంచి ఒక్కొక్కరు మరణించారు. గత 24 గంటల్లో 910 మంది కోలుకోవడంతో వైరల్ ఇన్‌ఫెక్షన్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,62,832కి చేరుకుంది. రికవరీ రేటు 98.79 శాతంగా ఉంది. మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. రోజువారీ పాజిటివిటీ రేటు, వీక్లీ పాజిటివిటీ రేటు వరుసగా 1.33 శాతం మరియు 1.23 శాతంగా ఉన్నాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, దేశంలో ఇప్పటివరకు 220.65 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్‌లు ఇవ్వబడ్డాయి. గత 24 గంటల్లో మొత్తం 1,19,560 కోవిడ్ పరీక్షలు నిర్వహించగా, ఇప్పటివరకు 92.08 కోట్ల పరీక్షలు జరిగాయి. రోజువారీ కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఒమిక్రాన్‌ సబ్‌వేరియెంట్‌ ఎక్స్‌బీబీ.1.16 విజృంభణ వల్లే కేసుల సంఖ్య పెరుగుతోందని కేంద్రం చెబుతోంది.

Show comments