Site icon NTV Telugu

Panthangi Toll plaza: కేంద్రబలగాల అధీనంలో పంతంగి టోల్ ప్లాజా

Toll Plaza

Toll Plaza

మునుగోడు ఉప ఎన్నిక వేడి రాజుకుంది. ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని పంతంగి టోల్ ప్లాజాను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి కేంద్ర బలగాలు. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైన నాటి నుండి టోల్ ప్లాజా వద్ద తెలంగాణ ప్రభుత్వం చెక్ పోస్ట్ లు పెట్టి వాహనాలను తనిఖీలు నిర్వహిస్తోంది. దీంతో పాటు జాతీయ రహదారిపై వున్న పలు చెక్ పోస్ట్ ల వద్ద డబ్బులు కట్టలు కట్టలు దొరుకుతున్నాయి. దీంతో కేంద్ర బలగాలు కూడా ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని నిర్ణయించింది. ఇవాళ్టి నుంచి పంతంగి టోల్ ప్లాజా ను తమ అధీనంలోకి తీసుకొని ప్రతి వాహనాన్ని తనిఖీలు నిర్వహిస్తున్నాయి కేంద్ర బలగాలు.

ఈ ఉప ఎన్నికను అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ,టీఆర్ఎస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. దీంతో ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. రెండురోజుల క్రితం కోటి రూపాయల నగదును పోలీసులు సీజ్ చేశారు. మునుగోడు(Munugode)లో ఎలాగైనా గెలవాలని చూస్తున్న పార్టీలు ఇతర ప్రాంతాలనుంచి నగదును తరలిస్తున్నాయి. కారులో తరలిస్తున్న నగదు కట్టలు పోలీసుల తనిఖీలో బయటపడ్డాయి. ఇవి మునుగోడు ఉప ఎన్నిక కోసం తీసుకొస్తున్న బీజేపీ(BJP)కి చెందిన కోటి రూపాయలుగా చెబుతున్నారు. మునుగోడు మండలం చల్మెడ చెక్ పోస్ట్ వద్ద పోలీసుల వాహన తనిఖీలు చేస్తుండగా ఈ నగదు పట్టుబడింది.

Read Also: State Bank Of India: నిరుద్యోగులకు శుభవార్త.. 1,422 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

ఇదే కాకుండా హైదరాబాద్ లో ఎక్కడో చోట హవాలా మనీ చిక్కుతోంది. జూబ్లీహిల్స్ లో 54 లక్షలు, మరోచోట 2.5కోట్ల రూపాయల హవాలా డబ్బు పోలీసులకు చిక్కింది. బంజారాహిల్స్‌లో రూ.2 కోట్లు, చాంద్రాయణగుట్టలో రూ. 79 లక్షలు, జూబ్లీహిల్స్‌లో రూ. 2 కోట్లు ఇలా పట్టుబడుతూనే ఉంది. దీనిపై అధికారులు సైతం సీరియస్ గా తీసుకుంటున్నారు. పది రోజుల వ్యవధిలోనే సుమారు 10 కోట్లకు పైగానే డబ్బు పట్టుబడిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మరోవైపు ఓటర్లకు డిజిటల్ రూపంలో డబ్బుల పంపిణీ జరుగుతోందని సమాచారం. డబ్బులు ఇస్తే తెలిసిపోతుందని వివిధ బహుమతుల రూపంలో ఓటర్లకు తాయిలాలు అందుతున్నాయి. ఇతర ప్రాంతాల్లో ఉన్న మునుగోడు ఓటర్ల కోసం ఎంత ఖర్చుపెటడానికైనా పార్టీలు వెనుకాడడం లేదు. ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసి మరీ వారిని తమ తమ స్వగ్రామాలకు తరలిస్తున్నాయి పార్టీలు.

Read Also: Snake on Plane: విమానంలో పాము.. ఆందోళనకు గురైన ప్రయాణికులు..

Exit mobile version