NTV Telugu Site icon

Andhra Pradesh: ఏపీలో దొంగ ఓట్ల పంచాయితీ.. రంగంలోకి ఈసీ..!

Ec

Ec

Andhra Pradesh: ప్రజాస్వామ్యంలో నేతల రాతలు మార్చేదీ.. ప్రజల భవిష్యత్తును నిర్ణయించేది ఓటే. అటువంటి ఓట్లతో కొంతమంది నేతలు చెలగాటమాడుతున్నారు. బీఎల్వోలపై ఒత్తిడి తెస్తూ.. ఓట్ల జాబితాలను ఇష్టారీతిన మార్చేస్తున్నారు. కొన్ని చోట్ల ఒకే ఇంటి నంబరుపై పదుల్లో.. మరికొన్ని చోట్ల అసలు ఇంటి నంబరే లేకున్నప్పటికీ.. ఓట్లను చేర్చేశారు. వీటిని గుర్తించి తొలగించాల్సిన యంత్రాంగం చేతులు కట్టుకుని చోద్యం చూస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో దొంగ ఓట్ల వ్యవహారం ఢిల్లీకి చేరింది. మూడు ప్రధాన పార్టీలకు చెందిన నేతలు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు…ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఎన్నికల్లో లబ్ది పొందేందుకు భారీ స్థాయిలో దొంగ ఓట్లు నమోదు చేయిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. అయితే దొంగ ఓట్లు టీడీపీ హయాంలోనే నమోదు చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దొంగ ఓట్ల వ్యవహారంపై బీజేపీ సీరియస్ అయ్యింది. సీఈసీకి ఫిర్యాదు చేశారు ఆ పార్టీ నేతలు.

ఏపీలో టీడీపీ నేతలు 40లక్షల 76వేల 580 దొంగ ఓట్లను ఓటర్ జాబితాలో చేర్చారని వైసీపీ ఎంపీలు కంప్లెయిట్‌ చేశారు. ఒకే ఫొటోతో ఇంటి పేరు మార్చి అవకతవకలకు పాల్పడ్డారని చెప్పారు. దొంగ ఓట్లన్నీ టీడీపీ సానుభూతిపరులవే అంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలో ఉన్న టీడీపీ సానుభూతిపరుల ఓట్లను కూడా ఏపీలో కూడా నమోదు చేయించారని ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లారు. విచారణ చేసి దొంగ ఓటర్లను తొలగిస్తున్న బూత్ లెవల్ అధికారులపై కూడా టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని తెలిపారు. వైసీపీ సానుభూతిపరుల ఓటర్లు తొలగించేందుకు ఫారం-7 దరఖాస్తులు ఇస్తున్నారని ఆరోపించారు. విచారణలో నిజాలు వెలుగు చూస్తుండటంలో.. బూత్‌ లెవల్‌ అధికారులను కూడా టీడీపీ నేతలు బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేశారు వైసీపీ ఎంపీలు. తండ్రి పేరు, ఇంటి పేరు మార్చేసి ఒకే ఓటర్‌ను రెండు నియోజకవర్గాల్లో చేర్పిస్తున్నారని చెప్పుకొచ్చారు.

మరోవైపు టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్‌, గల్లా జయదేవ్, రామ్మోహన్‌ నాయుడు.. సీఈసీని కలిశారు. ఏపీలో ప్రభుత్వం ఏ విధంగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందో ఎన్నికల సంగం దృష్టికి తీసుకెళ్లామన్నారు. దొంగే దొంగ అన్నట్లు వైసీపీ నేతల వ్యవహార శైలి ఉందన్నారు ఎంపీ కనకమేడల. అధికారులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, 10 లక్షల మంది ఓటర్లు ఫిర్యాదు చేశారని, వాటిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు వివరించారు. ఏపీ బీజేపీ నేతలు కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి నేతృత్వంలో… ఎన్నికల కమిషనర్‌ను కలిసింది బీజేపీ నేతల బృందం. ఓట్ల జాబితాలో అవకతవకలపై ఫిర్యాదు చేశారు. ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు బీజేపీ చీఫ్‌ పురందేశ్వరి. ఓటర్‌ కార్డును కూడా డూప్లికేట్‌ చేస్తున్నారని చెప్పారు. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా ఈసీ ఇచ్చామన్నారు పురందేశ్వరి. విశాఖ నియోజకవర్గంలో మొత్తం 2లక్షల ఓట్లు ఉంటే… అందులో 61వేల దొంగ ఓట్లే అని తమ సర్వేలో తేలిందన్నారు. దీనికి రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో… కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని చెప్పారు పురందేశ్వరి. తిరుపతి ఉపఎన్నికల్లో దాదాపు 35 వేల మంది నకిలీ ఓట్లు వేశారని.. అలాగే విశాఖలో భౌతికంగా లేనివారికి సంబంధించి 61వేల ఓట్లు చేర్చారని ఆమె ఆరోపించారు. విశాఖపట్నం నార్త్‌లో ఇంటింటి సర్వే చేయగా 2 లక్షల 70 వేల మంది ఓటర్లు ఉంటే అదనంగా మరో 61 వేల మంది ఓట్లు నమోదు చేశారన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించిందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో దొంగ ఓట్ల విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు దొంగే దొంగ అననట్లు వ్యవహరిస్తున్నారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఏపీలో తొలగించిన ప్రతి ఓటుపై నిశిత పరిశీలన చేయాలన్న ఆయన…ఓట్ల తొలగింపుపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. గతంలో వ్యవస్థలను మేనేజ్‌ చేసి…ఓటర్ల జాబితాలో అక్రమాలు చేశారని అన్నారు. గతంలో టీడీపీ చేసిన తప్పులను తాము సరిదిద్దామన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఏపీలో టీడీపీ నేతలు 40లక్షల 76 వేల 580 ఓట్లను ఒకే ఫొటోతో ఇంటి పేరు​ మార్చి నమోదు చేసినట్లు వైసీపీ ఎంపీలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ అధికారిగా లేక ఎన్నికల కమిషన్ అధికారిగా ప్రజలను మభ్యపెడుతూ వివరాలు సేకరిస్తున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. కర్నాటకతో పాటు బయట ప్రాంతాలకు చెందిన వారిని తప్పుడు ఆచూకీతో ఓటర్లుగా నమోదు చేయిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతకొన్ని నెలలుగా దొంగ ఓట్ల వ్యవహారం కలకలం రేపుతూనే ఉంది. 26 జిల్లాల్లోని నియోజకవర్గాల ఓటర్ల జాబితాలు తప్పుల తడకలుగా దర్శనమిస్తున్నాయి. ప్రతి నియోజకవర్గంలో ఓకే ఇంటి నెంబర్‌తో ఉన్న వందలాది దొంగ ఓట్లు వెలుగు చూస్తున్నాయి. ఈ వ్యవహారంపై పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్‌కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశాయి. వందేళ్లకు పైబడిన ఓటర్లు, ఏ చిరునామా లేని వారి పేర్లు జాబితాల్లో పెద్దదిగా ఉండటంతో పార్టీలు ఆందోళనకు గురవుతున్నాయి. ఒకే ఇంటి నెంబర్ , జీరో ఇంటి నెంబర్ పై పెద్ద సంఖ్యలో ఓట్లు నమోదు అయ్యాయని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఏపీలో 27,13,443 దొంగ ఓట్లు ఉన్నట్లు గుర్తించింది. జీరో ఇంటి నెంబర్‌తో 2,51,767 ఓట్లు ఉన్నాయి. ఒకే డోర్ నెంబరుపై పది అంతకు మించి ఓట్లు ఉన్న ఇళ్లు… 1,57,939 అని ఎన్నికల సంఘం తెలిపింది. ఒకే డోర్ నెంబరు కలిగిన ఓట్లు 24,61,676 ఉన్నట్టు గుర్తించింది. బూత్ లెవల్ అధికారులతో ఓటర్ల జాబితాపై పరిశీలన చేపట్టింది ఎన్నికల సంఘం. దీంతో దొంగ ఓట్ల బాగోతం వెలుగుచూసింది. రాష్ట్రంలోని కొన్ని చోట్ల అధికారులపై ఎన్నికల సంఘం అధికారులు చర్యలు తీసుకున్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో 6 వేల దొంగ ఓట్లు చేర్పించారని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం విచారణ చేపట్టి జిల్లా పరిషత్ సీఈవో భాస్కర్‌రెడ్డిని సస్పెండ్ చేసింది.

వైసీపీ తీరు దొంగే దొంగ అన్నట్టు ఉందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పక్క రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ వాళ్లు ఓటు వేయకూడదా అని ప్రశ్నించారు. దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నిస్తే మాత్రం ఊరుకోమని… జైలుకు పంపిస్తామని హెచ్చరించారు చంద్రబాబు. ఓటర్ల జాబితా నుంచి చనిపోయిన వారి పేర్లను తొలగించాల్సి ఉండగా.. ఆ ప్రక్రియ చేపట్టలేదు. పది, అయిదు సంవత్సరాల క్రితం మృతి చెందిన వారి పేర్లు కూడా ఓటర్ల లిస్టులో ఉన్నాయి. ఇలాంటి ఏ ఒక్క గ్రామానికో, కాలనీతో పరిమితం కాలేదు. చనిపోయిన వారి పేరుతో ఓటరు జాబితాను పరిశీలించగా.. వారి ఫొటో కాకుండా మరొకరి చిత్రాన్ని మార్ఫింగ్‌ చేసి పెడుతున్నారు. అందులో ఉన్న వ్యక్తులు ఎవరో కూడా అక్కడి వారికి తెలియడం లేదు.