Site icon NTV Telugu

CD Gopinath: భారత క్రికెట్‌‌లో ముగిసిన ఒక స్వర్ణయుగం.. తొలి టెస్ట్ విజేత ‘చివరి యోధుడు’ కన్నుమూత!

Cd Gopinath

Cd Gopinath

CD Gopinath: భారత క్రికెట్ చరిత్రలో ఒక స్వర్ణయుగం ముగిసింది. దేశానికి మొట్టమొదటి టెస్ట్ విజయాన్ని అందించిన చారిత్రాత్మక జట్టులో సభ్యుడైన చివరి దిగ్గజం సి.డి.గోపీనాథ్ (చింగల్‌పుట్ దొరైకన్ను గోపీనాథ్) కన్నుమూశారు. ఆయన మరణంపై క్రికెట్ లోకం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. భారత క్రికెట్ జట్టు అత్యంత సీనియర్ మాజీ క్రికెటర్ సి.డి. గోపీనాథ్ (96) చెన్నైలోని అడయార్‌ ప్రాంతంలో ఉన్న తన కుమార్తె నివాసంలో తుదిశ్వాస విడిచారు. 2024లో దత్తా గైక్వాడ్ మరణం తర్వాత, 1952లో ఇంగ్లాండ్‌పై భారత్ సాధించిన తొలి టెస్ట్ విజయ జట్టులో జీవించి ఉన్న ఏకైక సభ్యుడు గోపీనాథ్ మాత్రమే. ఆయన మరణంతో ఆ చారిత్రాత్మక జట్టులోని అందరూ దిగ్గజాలు జ్ఞాపకాలుగా మిగిలిపోయారు.

READ ALSO: TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

తొలి టెస్ట్ విజయ జట్టులో కీలక పాత్ర..
1951-52లో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో గోపీనాథ్ తన టెస్ట్ అరంగేట్రం చేశారు. మద్రాసు (చెన్నై) వేదికగా జరిగిన ఆ చారిత్రాత్మక టెస్టులో భారత్ విజయం సాధించడంలో గోపీనాథ్ కీలక పాత్ర పోషించారు. ఆ మ్యాచ్‌లో ఆయన 35 పరుగులు చేయడమే కాకుండా, వినూ మంకడ్ బౌలింగ్‌లో బ్రియాన్ స్టాథమ్‌ ఇచ్చిన కీలక క్యాచ్‌ను అందుకుని భారత్‌కు విజయాన్ని ఖాయం చేశారు.

గోపీనాథ్ క్రికెట్ ప్రస్థానం..
1930 మార్చి 1న చెన్నైలో జన్మించిన ఈ దిగ్గజ క్రికెటర్.. భారత్ తరపున 8 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 242 పరుగులు చేశారు. ఇందులో ఒక అర్ధసెంచరీ ఉంది. ఫస్ట్-క్లాస్ రికార్డుల విషయానికి వస్తే.. ఆయన తన కెరీర్‌లో 83 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడి 4,259 పరుగులు చేశారు. ఇందులో 9 సెంచరీలు, 14 వికెట్లు ఉన్నాయి. 1960లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆయన ఆస్ట్రేలియాపై తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు. మైదానంలో ఆటగాడిగానే కాకుండా, క్రికెట్ పరిపాలనలోనూ గోపీనాథ్ విశేష సేవలందించారు. 1970లలో ఆయన భారత జాతీయ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా పనిచేశారు. అలాగే 1979 ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టుకు మేనేజర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. అనేక సీజన్ల పాటు మద్రాస్ (తమిళనాడు) జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి దేశీయ క్రికెట్‌లో తనదైన ముద్ర వేశారు. గోపీనాథ్ మరణం పట్ల తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (TNCA) సంతాపం వ్యక్తం చేస్తూ.. “భారత క్రికెట్‌కు నిజమైన మార్గదర్శకుడు, తొలి టెస్ట్ విజయ జట్టులోని చివరి సభ్యుడు ఇకలేరు. మీ వారసత్వం క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉంటుంది” అని పేర్కొంది. గోపీనాథ్ మరణం భారత క్రికెట్ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయానికి ముగింపు పలికింది. ఆయన మరణం పట్ల పలువురు మాజీ క్రికెటర్లు, క్రీడా అభిమానులు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు.

READ ALSO: Chanakya Niti: కోట్లు సంపాదించాలన్నా .. కూటికి లేని బిచ్చగాడు కావాలన్నా ఈ అలవాట్లే కారణం.. చాణక్యుడు చెప్పిన కెరీర్ సీక్రెట్స్!

Exit mobile version