JD Lakshminarayana New Political Party: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమీపిస్తున్న తరుణంలో మరో కొత్త పార్టీ తెరపైకి వచ్చింది.. వీఆర్ఎస్ తీసుకుని రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. గత ఎన్నికల్లో పోటీ చేసినా విజయాన్ని అందుకోలేకపోయారు.. అయితే, మరోసారి ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రం పక్కా అని చెబుతూనే ఉన్నారు.. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి అన్నట్లుగా.. తాను ఓటమి పాలైన లోక్‌సభ స్థానం నుంచే మళ్లీ పోటీ చేస్తానని చెబుతూనే వస్తున్నారు వీవీ లక్ష్మీనారాయణ.. గత ఎన్నికల్లో ఆయన జనసేన పార్టీ నుంచి బరిలోకి దిగారు.. ఆ తర్వాత రాజీనామా చేయడంతో.. ఈ సారి ఏ పార్టీలో చేరతారు? ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతారనే ప్రశ్నలు కూడా ఉత్పన్నం అయ్యాయి.. అయితే, దీనిపై కూడా తేల్చేశారు లక్ష్మీనారాయణ.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో విశాఖ నుంచి లోక్ సభ సభ్యునిగా పోటీ చేస్తానని.. అదికూడా ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగనున్నట్టు గతంలో చెప్పారు.. అయితే, ఇప్పుడు ఆయన కొత్త పార్టీ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారని ప్రచారం సాగుతోంది.. అంతేకాదు.. కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ పేరు దరఖాస్తు చేసుకోవడం.. పార్టీ పేరు కూడా ఖరారు అయ్యిందని.. ఇక ప్రకటనే మిగిలింది అంటున్నారు..
అయితే, వీఆర్ఎస్ తీసుకుని రాజకీయాల్లోకి అడుగులు వేసిన లక్ష్మీనారాయణ ఓ దశలో బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతారనిపించింది.. విద్యావంతులు, యువతలో వచ్చిన క్రేజ్ దానికి కారణం.. అయితే, ఎంత వ్యక్తిగత ఇమేజ్ ఉన్నా పొలిటికల్ ప్లాట్‌ఫామ్ కూడా ఉండాలని కావున.. గత ఎన్నికల్లో జనసేన పార్టీలో చేరారు.. గ్లాసు గుర్తుపై విశాఖ లోక్‌సభ ఎంపీగా బరిలోకి దిగారు.. 2.80 లక్షలకు పైగా ఓట్లు సాధించినా విజయం దక్కలేదు.. ఆ తర్వాత జనసేనకు గుడ్‌బై చెప్పిన వీవీ.. నాలుగున్నరేళ్లుగా విశ్లేషకుడిగా మారిపోయారు. అయితే, తనకు కలిసివచ్చే ఏ వేదికను కూడా ఆయన వదలడంలేదు.. నిత్యం ప్రజల్లో ఉంటూ వస్తున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ.. అందరికీ మరింత చేరువగా వెళ్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీచేయడం పక్కా అని తేల్చేసిన ఆయన.. ఇప్పుడు మరో పార్టీలో చేరడం ఏంటి? అనే ఉద్దేశంతో కొత్త పార్టీ పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారట.. అందులో భాగంగానే ఆరు నెలల క్రితమే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గర ‘జై భారత్ నేషనల్‌పార్టీ’ పేరుతో దరఖాస్తు పెట్టుకున్నారట..
మరోవైపు.. గురువారం రాత్రి విజయవాడలోని ఓ హోటల్‌లో భావసారూప్యత కలిగిన వారితో వీవీ సమావేశమై తన కార్యాచరణపై చర్చించారట.. అర్ధరాత్రి ప్రారంభమైన ఈ సమావేశానికి “అర్ధరాత్రి ఆలోచన” అని పిలిచారట.. ఆ భేటీ శుక్రవారం తెల్లవారుజాము వరకు కొనసాగినట్టు తెలుస్తోంది.. అర్ధరాత్రి దాటిన తర్వాతే సమావేశం ఎందుకు జరిగింది? అని ప్రశ్నిస్తే భారతదేశానికి స్వాతంత్ర్య ప్రకటనతో సహా దేశంలోని అన్ని ప్రధాన పరిణామాలు అర్ధరాత్రి తర్వాత మాత్రమే జరిగాయి. అందుకే అర్థరాత్రి దాటిన తర్వాతే ప్రజల సమస్యలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాను’’ అంటూ మాజీ జేడీ మీడియాతో వ్యాఖ్యానించారు. డబ్బు, కుల, వంశ రాజకీయాలను ప్రజలు తిరస్కరించాలని లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. “ఏ రాజకీయ పార్టీ లేదా ప్రభుత్వం సామాన్య ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం లేదు. ప్రస్తుత రాజకీయ నాయకులు ప్రజల గురించి పట్టించుకోవడం మానేసి వారి కుటుంబ సభ్యులను ప్రోత్సహిస్తున్నారు” అని దయన దుయ్యబట్టారు. ఓటర్లను ప్రకాశవంతం చేయడం ద్వారా రాజకీయాలను సమూలంగా మార్చాలని సీబీఐ మాజీ అధికారి పిలుపునిచ్చారు. పరిపాలనలో ఏం జరుగుతుందో, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో ప్రజలకు తెలిసేలా మాకు పారదర్శక ప్రభుత్వం అవసరం అని ఆయన చెప్పుకొచ్చారు.. అయితే, ఈ రోజు రాత్రి 7.30 గంటలకు విజయవాడలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు లక్ష్మీ నారాయణ.. దీంతో.. జేడీ లక్ష్మీనారాయణ కీలక రాజకీయ ప్రకటన చేయనున్నారంటూ మీడియాకు సమాచారం ఇచ్చారు. దీంతో.. సీబీఐ మాజీ జేడీ కొత్త పార్టీ పెట్టడం ఖాయంగా తెలుస్తోంది.
