NTV Telugu Site icon

Canada PM Divorce: 18 ఏళ్ల వైవాహిక బంధానికి కెనడా ప్రధాని స్వస్తి.. అది మాత్రం కొనసాగుతుందంటూ..!

Canada Pm Divorce

Canada Pm Divorce

Canadian PM Justin Trudeau and wife Sophie announce Separation: 18 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు చెబుతున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో, ఆయన సతీమణి సోఫీ గ్రెగొయ్‌రీ ట్రూడో బుధవారం ప్రకటించారు. పలుమార్లు సామరస్యంగా చర్చించుకున్న తర్వాత తాము విడిపోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తెలిపారు. ఇప్పటికే తమ విడాకుల సంబంధ చట్టపర అంగీకార పత్రంపై జస్టిన్‌ ట్రూడో, సోఫీ ట్రూడో సంతకాలు చేసినట్టు ప్రధాని కార్యాలయం పేర్కొంది.

2005లో వివాహం చేసుకున్న కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో దంపతులకు ముగ్గురు పిల్లలు (ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె) ఉన్నారు. పిల్లల సంరక్షణను ఇద్దరూ కలిసి చూసుకుంటామని తెలిపారు. ఇప్పటికే ఒట్టావాలో మరో నివాసంకు సోఫీ ట్రూడో షిఫ్ట్ అయ్యారు. పిల్లల్ని చూసేందుకు, అధికారిక పర్యటనల నిమిత్తం ప్రధాని వెళ్లినప్పుడూ పిల్లల్ని చూసుకునేందుకు రిడియా కాటేజికి వస్తుంటానని సోఫీ ట్రూడో పేర్కొన్నారు. ఎప్పటి లానే తమ మధ్య ప్రేమ, పరస్పర గౌరవం ఉంటాయని ప్రధాని దంపతులు చెప్పుకొచ్చారు. మోడల్‌గా, టీవీ వ్యాఖ్యాతగా సోఫీ సుపరిచితురాలే.

అధికారంలో ఉండగానే విడాకులు తీసుకున్న రెండో కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో. ఆయన తండ్రి, మాజీ ప్రధాని పియరీ ట్రూడో కూడా అధికారంలో ఉండగానే విడాకులు తీసుకున్నారు. కెనడాలో అత్యంత ప్రభావశీల వ్యక్తిగా పేరొందిన తండ్రి పియరీ ట్రూడో నుంచి జస్టిన్‌ ట్రూడో రాజకీయ వారసత్వం పుణికిపుచ్చుకున్నారు. 2015లో ఆయన ప్రధానిగా ఎన్నికయ్యారు.

Also Read: IND vs WI: నేడే భారత్-విండీస్ తొలి టీ20.. హైదరాబాద్‌ కుర్రాడు అరంగేట్రం! తుది జట్టు ఇదే