NTV Telugu Site icon

Cameron Green: అరుదైన వ్యాధితో బాధపడుతున్నా.. 12 ఏళ్లకు మించి బతకలేనన్నారు: కామెరూన్‌ గ్రీన్‌

Cameron Green Disease

Cameron Green Disease

Cameron Green Suffers From Kidney Disease: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ షాకింగ్ న్యూస్ చెప్పాడు. తాను చిన్నప్పటి నుంచి అరుదైన కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్నానని, అది పూర్తిగా నయం కాని వ్యాధి అని తెలిపాడు. తన మూత్ర పిండాలు మిగతా వారిలా రక్తాన్ని శుద్ధి చేయవని, అవి ప్రస్తుతం 60 శాతమే పనిచేస్తున్నాయని గ్రీన్ చెప్పాడు. ప్రస్తుతం పాకిస్థాన్‌తో ఆస్ట్రేలియా మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు ఎంపిక కాని గ్రీన్.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు.

తాజాగా కామెరూన్‌ గ్రీన్‌ ‘ఛానెల్ 7’తో మాట్లాడుతూ… ‘నాకు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఉంది. ఈ విషయాన్ని నేను పుట్టినప్పుడు నా తల్లిదండ్రులకు వైద్యులు చెప్పారు. ఈ వ్యాధికి ఎటువంటి లక్షణాలు ఉండవు. కేవలం అల్ట్రాసౌండ్‌ల ద్వారానే గుర్తించాలి. మిగతా వారిలా నా కిడ్నీలు పనిచేయలేవు. ప్రస్తుతం 60 శాతం పని చేస్తున్నాయి. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్న ఇతర వ్యక్తుల వలె నేను శారీరకంగా ప్రభావితం కాలేదు. ఈ వ్యాధిలో ఐదు దశలు ఉన్నాయి. మొదటి దశ ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఐదవ దశలో కిడ్నీ మార్పిడి లేదా డయాలసిస్ చేయాలి. ఇప్పుడు నేను స్టేజ్-2లో ఉన్నాను. వాటిని బాగా చూసుకోకపోతే పాడయ్యే ప్రమాదముంది’ అని తెలిపాడు.

Also Read: IND vs SA: సూర్యకుమార్‌ మెరుపు సెంచరీ.. దక్షిణాఫ్రికాపై భారత్‌ ఘన విజయం! సిరీస్‌ సమం

తాను 12 ఏళ్లకు మించి బతకలేనని మా తల్లిదండ్రులకు వైద్యులు చెప్పారని, ఇన్ని ఏళ్లు బాగా ఉన్నందుకు సంతోషంగా ఉందని కామెరూన్‌ గ్రీన్‌ తెలిపాడు. గ్రీన్‌ తల్లి టార్సీ 19 వారాల గర్భంతో ఉండగా.. స్కానింగ్‌లో ఈ విషయం బయటపడింది. గ్రీన్‌ 12 ఏళ్ల కంటే ఎక్కువ బతకడని ఆ సమయంలో వైద్యులు చెప్పినట్లు తండ్రి గ్యారీ చెప్పాడు. గ్రీన్ పుట్టిన తర్వాత ఇంక్యుబేటర్ లో ఉంచారని తెలిపాడు. ఇక 24 ఏళ్ల గ్రీన్ ఐపీఎల్‌ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడనున్నాడు. ఇటీవల ఆర్‌సీబీ గ్రీన్‌ను ముంబై ఇండియన్స్‌ నుంచి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. గ్రీన్ కోసం ఆర్‌సీబీ రూ. 17.5 కోట్లు వెచ్చించింది.