Camel Killed Owner in Uttar Pradesh: ఎంతో ప్రేమగా పెంచుకున్న ఓ ఒంటె యజమాని ప్రాణాలనే పొట్టన పెట్టుకుంది. నీరు పెడుతుండగా మహిళ ప్రాణాలను తీసింది. మహిళ గొంతును నోటితో కరచుకొని దవడలతో పీక నొక్కేసింది. దీంతో ఊపిరాడక ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్ జిల్లాలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. దాడిలో చనిపోయిన మహిళను తోతా దేవిగా గుర్తించారు.
సస్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్గోయ్ గ్రామానికి చెందిన వ్యక్తి ‘పప్పు బఘేల్’. ఇతని భార్య పేరు ‘తోతా దేవి’. వీరు ఇంటి వద్ద ఓ ఒంటెను పెంచుకుంటున్నారు. వ్యవసాయ పనిముట్లు, ఇతర సామానులు మోసేందుకు పప్పు బఘేల్ దంపతులు ఆ ఒంటెను ఉపయోగించుకుంటున్నారు. వీరికి ఒంటెల బండి కూడా ఉంది. ఎప్పటిలాగే ఆదివారం (జులై 2) మధ్యాహ్నం ఒంటెకు నీళ్లు పెట్టేందుకు దేవి దాని వద్దకు వెళ్లింది. ఆ సమయంలో ఆమెపై ఒంటె దాడి చేసింది.
ముందుగా తోతా దేవి చేతిని నమిలింది. ఆపై ఆమె తలను తన రెండు దవడల్లో బంధించింది. తోతా దేవి అరుపులు విన్న చుట్టుపక్కన వారు అక్కడికి చేరుకున్నారు. ఒంటెను కర్రలతో బాది దాని నోట్లో నుంచి దేవిని విడిపించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందింది. ఈ ఘటనతో బస్గోయ్ గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. తోతా దేవి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు ఆమె బంధువులు నిరాకరించారు. దాంతో పోలీసులు, బంధువుల మధ్య కాస్త వాగ్వాదం నడించింది. చివరకు ఆదివారం దేవి అంత్యక్రియలను కుటుంబ సభ్యులు నిర్వహించారు.