Human Trafficking Case Update: నిరుద్యోగులే లక్ష్యంగా అమాయకులకు కంబోడియాలో ఉద్యోగం పేరుతో వల వేసి, అక్కడకు వెళ్లాక పాస్ పోర్ట్, వీసాలు తీసేసుకుంటారు. ఏడాది పాటు బలవంతంగా ఇండియాలోనే ఆర్థిక నేరాలు చేయిస్తున్న ముఠా దారుణాలు వెలుగు చూశాయి. పక్కా సమాచారంతో విశాఖ పోలీసులు ఈ ముఠాకు చెక్ పెట్టారు. ఉద్యోగం పేరుతో కాంబోడియాకు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ల చేత మొబైల్ కాల్స్ ద్వారా రకరకాల సైబర్ నేరాలు చేయిస్తోంది ఆ ముఠా. ఇందుకోసం డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో ఆంధ్ర ప్రదేశ్ నుంచి చాలా మంది యువకులను కంబోడియాకు హ్యూమన్ ట్రాఫికింగ్ చేశారు. వారితో మోసాలు చేయిస్తున్న గ్యాంగ్‌ను విశాఖ పోలీసులు గుర్తించారు. వారితో బలవంతంగా ఫెడ్ ఏక్స్, టాస్క్ గేమ్ పేరిట సైబర్ నేరాలను చేయిస్తున్నట్టు నిర్దారించారు. నిరుద్యోగుల వద్ద నుంచి లక్షన్నర వరుకు వసూలు చేసి కంబోడియాకు పంపుతున్నట్లు గుర్తించారు. ఈ ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
Read Also: Hema: బెంగళూరు రేవ్ పార్టీ.. పోలీసులతో వివాదం.. మరో వీడియో పోస్ట్ చేసిన హేమ
తాజాగా కంబోడియాలో సైబర్ క్రైమ్ ఫ్రాడ్ ఫ్యాక్టరీల హబ్‌పై బాధితులు తిరగబడ్డారు. సిహనౌక్వేల్‌లోని జిన్బో & కాంపౌండ్‌లో వారి నిర్వాహకులకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. విశాఖ సిటీ పోలీసుల వాట్సాప్ నంబర్లకు యువకులు వీడియోలు పంపినట్లు తెలిసింది. ఇంటర్నేషనల్ సైబర్ ముఠాల ఆగడాల నుంచి విడిపించాలని యువకులు వీడియోలో విజ్ఞప్తి చేశారు. తిరుగుబాటు తర్వాత వారిలో ఎక్కువ మందిని కంబోడియా లోకల్ అథారిటీస్ అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. జైలులో ఉన్న భారతీయులను విడిపించడానికి బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను వైజాగ్ సిటీ పోలీసులు సంప్రదించారు. జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఫక్కీరప్ప సారథ్యంలో 7 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మానవ అక్రమ రవాణా కేసును విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నారు.