IRCTC Ticket Booking: అర్జంట్‌గా రైలు ప్రయాణం చేయాల్సి ఉందా..? సమయానికి డబ్బులు జేబులో లేవా? ఆ మొత్తాన్ని సమకూర్చుకునే సమయం కూడా లేదా..? అయితే, టెన్షన్ పడాల్సిన పనేలేదు.. హాయిగా మీరు జర్నీ చేయొచ్చు.. అదేంటి? ఉచితంగా రైలు ప్రయాణమా? అనే సందేహం వచ్చిందేమో.. రైలు ప్రయాణమే.. కానీ, ఉచితం కాదండోయ్.. ఎందుకంటే.. ఇప్పుడు డబ్బులు లేకున్నా టికెట్ బుక్ చేసుకోవచ్చు.. పేమెంట్ మాత్రం లేట్‌గా చేసే అవకాశం ఉంది.. ఈ సదుపాయాన్ని ఐఆర్‌సీటీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇలా బుక్ చేసుకునే టికెట్ల కోసం ‘బై నౌ పే లేటర్’ సదుపాయాన్ని కల్పిస్తోంది.
ఇక, ఈ సేవలను ప్రయాణికులకు అందించడానికి ఐఆర్‌సీటీసీ కొన్ని సంస్థలతో ఒప్పందం చేసుకుంది.. క్యాష్‌ఈ, పేటీఎం, ఈపేలేటర్‌తో చేతులు కలిపి.. ప్రయాణికులకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది ఐఆర్‌సీటీసీ.. క్యాష్‌ఈ ‘ట్రావెల్ నౌ పే లేటర్’ పేరిట ఈ సదుపాయాన్ని కల్పిస్తోంది. అయితే, ఈ టికెట్లను ఎలా పొందాలి..? ఎంత వరకు లిమిట్ ఉంటుంది? ఎన్ని రోజుల్లో తిరిగి చెల్లించాలి? అనే కండీషన్స్ కొన్ని ఉన్నాయి.. పేటీఎం తమ యూజర్ల కోసం పోస్ట్‌పెయిడ్ సర్వీసులను అందిస్తుండగా.. 30 రోజుల వరకు ఎలాంటి వడ్డీ లేకుండా పేటీఎం తమ యూజర్లకు రూ.60,000 వరకు రుణాలు అందజేస్తోంది.. బిల్లింగ్ సైకిల్ ముగిసేలోపు చెల్లిస్తే ఎలాంటి వడ్డీ ఉండదని పేటీఎం వర్గాలు చెబుతున్నాయి.. అయితే, అప్పటికీ మొత్తం రీఫండ్ చేసే పరిస్థితి లేకపోతే.. ఆ పేమెంట్‌ను సులభంగా.. ఈఎంఐగా కూడా మార్చుకునే వెసులుబాటు ఉంటుంది.. దీని ద్వారా ఐఆర్‌సీటీసీలో రైల్వే టికెట్లను కూడా బుక్ చేసుకోవచ్చన్నమాట.
టికెట్ బుక్‌చేసుకునే వారు ఐఆర్‌సీటీసీ పోర్టల్‌లో తమ గమ్యస్థానం, ఇతర వివరాలు ఎంటర్ చేసిన తర్వాత టికెట్ బుక్‌చేసుకునే సమయంలో.. పేమెంట్ సెక్షన్‌లో పే లేటర్ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.. అక్కడే పేటీఎం పోస్ట్‌పెయిడ్‌ను ఎంపిక చేసుకోవచ్చు.. అయితే, పేటీఎం లాగిన్ వివరాలతో పాటు ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.. ఆ ప్రక్రియ పూర్తి అయితే.. రైల్వే టికెట్ బుకింగ్ ప్రక్రియ పూర్తి అయినట్టు. ఇక, టికెట్‌కు అయిన మొత్తాన్ని ఈఎంఐల కింద 3 లేదా 6 నెలల కాల వ్యవధిలో చెల్లించే వెసులుబాటు కల్పించారు.. మరోవైపు ఈపేలేటర్ అనే ఫిన్‌టెక్ సంస్థ సైతం ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురాగా.. అందులో మాత్రం 14 రోజుల్లోగా టికెట్ డబ్బులు చెల్లించాల్సి ఉంటుందనే నిబంధన పెట్టింది.. లేని పక్షంలో ఆ మొత్తంపై 36 శాతం వడ్డీ వసూలు చేయనున్నారు.. ఏదేమైనా డబ్బులు లేని సమయంలో అత్యవసర ప్రయాణాలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.