Butta Renuka: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారం పోయి.. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, ఇక కిందిస్థాయి ప్రజాప్రతినిధులు ఎంతో మంది.. వైసీపీకి రాజీనామా చేసి కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీలో చేరిపోయారు.. మరోవైపు, మరికొందరు కీలక నేతలపై కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ బుట్టా రేణుక కూడా వైసీపీకి గుడ్‌బై చెబుతారని.. జనసేన లేదా బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతుండగా.. తనపై జరుగుతున్న రాజకీయ ప్రచారంపై తీవ్రంగా స్పందించారు బుట్టా రేణుక… తాను బీజేపీ లేదా జనసేనలో చేరుతున్నానంటూ కావాలనే తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆమె ఖండించారు.
Read Also: Shivaji: సామాన్ల కామెంట్లపై ఎట్టకేలకు వెనక్కి తగ్గిన శివాజీ.. ‘సోషల్ మీడియా సాక్షిగా క్షమాపణలు
రాజకీయంగా ఎదుర్కోలేక, ప్రజల్లో తనకు ఉన్న ఆదరణను చూసి ఓర్వలేకే ఈ రకమైన అసత్య ప్రచారాలు చేస్తున్నారని బుట్టా రేణుక మండిపడ్డారు.. తనపై అవాస్తవాలను ప్రచారం చేసిన వారే భవిష్యత్తులో ప్రజల ముందు నవ్వులపాలవుతారని వ్యాఖ్యానించారు. 2019లో తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఎలాంటి ఆశలు, పదవులు ఆశించకుండా పార్టీ కోసం పనిచేశానని బుట్టా రేణుక తెలిపారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేశానని స్పష్టం చేశారు. ముఖ్యంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తనకు అపారమైన నమ్మకం ఉందని, ఆయన నాయకత్వంలోనే కొనసాగుతానని బుట్టా రేణుక ప్రకటించారు. జగనన్నను విడిచి వెళ్లాల్సి వస్తే అదే తన రాజకీయ జీవితానికి చివరి రోజే అని కీలక వ్యాఖ్యలు చేశారు.. ఈ వ్యాఖ్యలతో తన పార్టీ మార్పుపై జరుగుతున్న ఊహాగానాలకు బుట్టా రేణుక పూర్తిగా తెరదించారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.