Site icon NTV Telugu

Business Headlines 25-02-23: పేటీఎం బ్యాంక్‌లో ఎయిర్‌టెల్‌ బ్యాంక్‌ విలీనం?. మరిన్ని వార్తలు

Business Headlines 25 02 23

Business Headlines 25 02 23

Business Headlines 25-02-23:

పేటీఎం బ్యాంక్‌లో విలీనం?

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌లో ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ విలీనమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఎయిర్‌టెల్‌ అధినేత సునీల్‌ మిత్తల్‌ ప్రణాళిక రూపొందించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పేటీఎంలో విలీనం కావటం ద్వారా వాటా సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నారు. ఇతర షేర్‌ హోల్డర్ల నుంచి కూడా పేటీఎంలోని వాటాలను కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని చెబుతున్నారు. అయితే.. ఈ వార్తలపై స్పందించేందుకు భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రతినిధి నిరాకరించారు. ఇవన్నీ మార్కెట్‌ ఊహాగానాలేనని తెలిపారు.

జీ ఎంటర్టైన్‌మెంట్‌కి ఊరట

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌కి నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌.. NCLATలో ఊరట లభించింది. ఆ సంస్థపై గత వారం మొదలైన దివాలా చర్యలను NCLAT నిలిపివేసింది. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ డైరెక్టర్‌ అండ్‌ సీఈఓ పునీత్‌ గోయెల్‌ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించింది. అనంతరం.. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌కు మరియు ఇంటెరిమ్‌ రిజల్యూషన్‌ ప్రొఫెషనల్‌కు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని గడువు విధించింది. తదుపరి విచారణను వచ్చే నెల 29వ తేదీకి వాయిదా వేసింది.

ఇంకా అనిశ్చిత పరిస్థితులే

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ శక్తికాంతదాస్‌ అన్నారు. ఈ సవాళ్లను జీ20 దేశాలు సంకల్పంతో పరిష్కరించాలని సూచించారు. జీ20 దేశాల ఆర్థిక మంత్రులు మరియు కేంద్ర బ్యాంకుల గవర్నర్ల సమావేశంలో ఆయన ఈ మేరకు ప్రసంగించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ.. మాంద్యానికి బదులు మందగమనాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. ఇదే సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న దేశాల రుణాలు భారీగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

టాటా.. 3 డార్క్‌ ఎడిషన్లు

టాటా మోటార్స్‌ సంస్థ.. స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికిల్స్‌ కేటగిరీలో మూడు డార్క్‌ ఎడిషన్లను ఆవిష్కరించింది. నెక్సాన్‌, హారియర్‌, సఫారీల్లో ఈ ఎడిషన్లను రూపొందించింది. ఈ అప్డేటెడ్‌ వాహనాల్లో అమర్చిన అధునాతన సదుపాయాల వల్ల ప్రయాణికులకు మరింత భద్రత లభిస్తుందని టాటా మోటార్స్‌ తెలిపింది. కాలుష్య ఉద్గారాలకు సంబంధించిన తాజా ప్రమాణాలకు లోబడి వీటికి డిజైన్‌ చేసినట్లు వివరించింది. ఈ వాహనాల ధరలు 12 లక్షల 35 వేల నుంచి ప్రారంభమవుతాయని, గరిష్ట ధర 22 లక్షల 71 వేల రూపాయలని స్పష్టం చేసింది.

యూకో బ్యాంక్‌ లక్ష్యమిదే

యూకో బ్యాంక్‌.. కొత్త ఆర్థిక సంవత్సరంలో 2 వేల 500 కోట్ల రూపాయలకు పైగా నికర లాభాన్ని సొంతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. లోన్లు మరియు డిపాజిట్లలో 16 నుంచి 18 శాతం గ్రోత్‌ సాధించే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తోంది. బిజినెస్‌తోపాటు ప్రాఫిట్స్‌ను సైతం పెంచుకోవటంపై ఫోకస్‌ పెట్టనుంది. ఈ విషయాలను యూకో బ్యాంక్‌ ఎండీ అండ్‌ సీఈఓ సోమ శంకర ప్రసాద్‌ తెలిపారు. డిసెంబర్‌ క్వార్టర్‌లో 653 కోట్ల రూపాయల నికర లాభాన్ని పొందినట్లు చెప్పారు. బ్యాంక్‌ చరిత్రలో ఇదే అత్యధిక త్రైమాసిక లాభమని అన్నారు.

ఈ ఏడాది 2 చిప్‌ ప్లాంట్లు!

దేశంలో ఎలక్ట్రానిక్‌ చిప్‌ తయారీ ప్లాంట్ల నిర్మాణాన్ని మొదలుపెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ మేరకు ప్రస్తుత సంవత్సరంలో కనీసం రెండు కంపెనీలకైనా అనుమతి మంజూరు చేయాలని భావిస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ మరియు ఐటీ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. ఇండియా చేపడుతున్న సెమీ కండక్టర్‌ ప్రోగ్రామ్స్‌ దీర్ఘకాలిక లక్ష్యంతో కూడుకున్నవని చెప్పారు. ఎలక్ట్రానిక్‌ చిప్‌ మరియు డిస్‌ప్లే తయారీ ప్లాంట్ల ఏర్పాటుకు గతేడాది ఐదు సంస్థల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి.

Exit mobile version