Site icon NTV Telugu

Sheikh Hasina: “మీ భార్యల భారతీయ చీరలని కాల్చండి”.. “ఇండియా ఔట్‌” ప్రచారంపై పీఎం హసీనా ఆగ్రహం..

Sheik Hasina

Sheik Hasina

Sheikh Hasina: మాల్దీవుల దారిలోనే ‘‘ఇండియా ఔట్’’ అనే నినాదంతో బంగ్లాదేశ్ ప్రతిపక్ష పార్టీ బీఎన్‌పీ ఉద్యమాన్ని లేవనెత్తింది. భారతదేశానికి మిత్రురాలిగా ఉన్న ఆ దేశ ప్రధాని షేక్ హసీనాపై ద్వేషంతో అక్కడ మతఛాందసవాద బీఎన్‌పీ ఈ ప్రచారాన్ని ప్రారంభించింది. అయితే, ఈ ప్రచారంపై ప్రధాని షేక్ హసీనా ఘాటుగా స్పందించారు. నిజంగా భారతీయ ఉత్పత్తులను బహిష్కరిస్తే, ముందు వారు తమ భార్యల భారతీయ చీరలని తగలబెట్టాలని సవాల్ విసిరారు.

బంగ్లాదేశ్ పీఎం హసీనా ఇటీవల ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్‌పీ) ప్రారంభించిన భారతదేశ వ్యతిరేక ప్రచారంపై విరుచుకుపడ్డారు. బుధవారం ఒక ప్రసంగంలో మాట్లాడుతూ.. బీఎన్‌పీ నాయకులు నిజంగా భారత ఉత్పత్తులను బహిష్కరిస్తే, వారు వారి భార్యల భారతీయ చీరలను ముందుగా తగలబెట్టాలని అన్నారు. భారతీయ మసాలాలు లేకుండా తినగలారా..? అని ప్రశ్నించారు. నిజంగా వారు భారతీయ ఉత్పత్తులను బహిష్కరించగలరా..? అని అన్నారు.

‘‘బీఎన్‌పీ నాయకులు భారతీయ ఉత్పత్తులను బహిష్కరించాలని వాదిస్తున్నారు.. నా ప్రశ్న ఏంటంటే, ఈ ప్రచారం చేస్తున్న వారు తమ భార్యల వద్ద ఎన్ని భారతీయ చీరలు ఉన్నాయి.? వారు తమ భార్యల నుంచి చీరలను ఎందుకు తీసుకుని తగలబెట్టలేదు..?’’ అని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని షేక్ హసీనా చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బీఎన్‌పీ సీనియర్ జాయింట్ సెక్రటరీ మాట్లాడుతూ.. సాధారణంగా భారతీయ చీరలని బీఎన్‌పీ నాయకులు కొనుగోలు చేయరని, చాల ఏళ్ల క్రితం భారత్‌కి వచ్చిన సమయంలో తన మామా తన భార్యకు భారతీయ చీరను బహుమతిగా ఇచ్చారని అన్నారు.

Read Also: PM Modi: “సుప్రీంకోర్టుకు వెళ్లినా వారు బెయిల్ పొందలేరు”.. ఇండియా కూటమిపై ప్రధాని ఫైర్…

ఈ ఏడాది ప్రారంభంలో భారతీయ ఉత్పత్తులను బహిష్కరించండి అనే ప్రచారం అక్కడి సోషల్ మీడియాలో ఊపందుకుంది. ప్రతిపక్ష పార్టీ ఈ ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తోంది. బంగ్లాదేశ్ అంతర్గత రాజకీయాల్లో భారత జోక్యాన్ని వ్యతిరేకిస్తూ తాము ఈ ప్రచారాన్ని చేపట్టినట్లు ప్రతిపక్షం చెబుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికలను బీఎన్‌పీ బహిష్కరించింది, ఈ ఎన్నికల్లో మరోసారి షేక్ హసీనా భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు.

బంగ్లాదేశ్‌లో భారత వ్యతిరేకత పెరుగుతోంది. భారత ప్రభుత్వ తప్పుడు విధానాల వల్ల బంగ్లాదేశ్ రాజకీయంగా నష్టపోయిందని అక్కడి ప్రతిపక్ష బీఎన్పీ ఆరోపిస్తోంది. గత 15 ఏళ్లుగా బంగ్లా ఎన్నికల్లో ఇండియా జోక్యం చేసుకుంటోందని ఆరోపించింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకను భారత్ పట్టించుకోలేదని, 4బిలియన్ డాలర్ల సాయం చేయడాన్ని అవాస్తవం అని ఆ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోంది. ‘‘బాయ్‌కాట్ ఇండియా’’ ప్రచారం చేయడం వల్ల బంగ్లా-భారత్ ప్రజల మధ్య మతపరమైన, జాతీయవాద ఉద్రిక్తతలు ఏర్పడుతాయని బంగ్లా ప్రజలు కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version