Hyderabad: పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద కత్తితో బిల్డర్ హల్‌చల్.. బౌన్సర్లపై దాడికి యత్నం!!

Builder Knife Incident Pawan Kalyan

Builder Knife Incident Pawan Kalyan

Hyderabad: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసం వద్ద ఒక బిల్డర్ కత్తితో వీరంగం సృష్టించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మంలోని గణేశ్ టౌన్‌షిప్‌కు చెందిన బిల్డర్ భట్టు సుచేతన్ ఠాకూర్ నాయక్ ఈ ఘటనకు పాల్పడ్డాడు. జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 35లో ఉన్న పవన్ కళ్యాణ్ నివాసం వద్దకు చేరుకున్న అతను పవన్ కళ్యాణ్‌కు కలవనివ్వాలంటూ ఓ ఫ్లెక్సీ పట్టుకుని పట్టుబట్టాడు. పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు తాను గత 16 రోజులుగా పడుతున్న కష్టాలను ఆ ఫ్లెక్సీపై వివరించిన సుచేతన్ ఠాకూర్ నాయక్, తన సమస్యను నేరుగా చెప్పుకోవడానికి కొన్ని నిమిషాలు సమయం కేటాయించాలని పేర్కొన్నాడు. తాను తీవ్రమైన అప్పుల ఊబిలో కూరుకుపోయానని, వాటిని తీర్చేందుకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం అందించాలని చెబుతున్నాడు.

అయితే, అక్కడ విధుల్లో ఉన్న బౌన్సర్లతో వాగ్వాదానికి దిగిన బిల్డర్ భట్టు, తన వద్ద ఉన్న కత్తితో వారిని బెదిరిస్తూ దాడికి యత్నించాడు. అంతటితో ఆగకుండా తన ఛాతీ, చేతులపై కత్తితో కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన బౌన్సర్లు చాకచక్యంగా వ్యవహరించి అతడి చేతిలోని కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సుచేతన్ ఠాకూర్ నాయక్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతడి కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, వారి సమక్షంలో సుచేతన్‌కు నచ్చజెప్పి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం అతడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు.