NTV Telugu Site icon

AP Assembly: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. బడ్జెట్‌ ఎప్పుడంటే?

Ap Assembly

Ap Assembly

AP Assembly Sessions: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉదయం 10 గంటలకు గవర్నర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం ఉభయసభలూ మంగళవారానికి వాయిదా పడతాయి. అనంతరం స్పీకర్‌ తమ్మినేని సీతారాం నేతృత్వంలో బీఏసీ సమావేశం జరుగుతుంది. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎప్పటివరకు నిర్వహించాలనేది నిర్ణయించనున్నారు. ఈ సమావేశానికి సభానాయకుడు జగన్‌, టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడు హాజరవనున్నారు. 10 ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు టీడీపీ సిద్ధమైనట్లు సమాచారం. ప్రశ్నోత్తరాలకు సమయం ఇవ్వాలని ఈ సమావేశంలో టీడీపీ పట్టుబట్టాలని భావిస్తోంది. చివరి అసెంబ్లీ సమావేశాలు కావడంతో కనీసం వారం రోజులైనా సభ నిర్వహించాలని టీడీపీ కోరే అవకాశం ఉంది. మంగళవారం గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. అలాగే ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మృతి పట్ల శాసనమండలిలో సభ్యులు సమావేశమై సంతాప తీర్మానాన్ని ప్రవేశపెడతారు.

Read Also: TDP-Janasena: సీట్ల సర్దుబాటుపై మరోసారి పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీ..

అదేవిధంగా త్వరలో సార్వత్రిక ఎన్ని­కలు జరగనున్న నేపథ్యంలో ఈ నెల 7వ తేదీన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ 2024–25 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. బుధవారం ఉదయం 11 గంటలకు శాసనసభలో ప్రవేశపెడతారు. శాసనమండలిలో గతేడాది మాదిరిగానే ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్‌ ప్రవేశపెట్టినప్పటికీ, ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలలకు (ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు) ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు అసెంబ్లీ ఆమోదం పొందనున్నారు. ఈ సమావేశాలు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పట్టుబడితే.. దానికి సభానాయకుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి శాసనసభా వ్యవహారాల కమిటీ సమావేశంలో సమ్మతిస్తే.. అదనంగా మరొక రోజు సమావేశాలు కొనసాగే అవకాశం ఉందంటున్నారు.