Site icon NTV Telugu

Buddha Venkanna: చంద్రబాబు 26 ఏళ్ల కుర్రాడిలా పరుగెత్తుతున్నారు.. బుద్ధా వెంకన్న ఆసక్తికర వ్యాఖ్యలు!

Buddha Venkanna

Buddha Venkanna

సీఎం చంద్రబాబుపై అసభ్యకరంగా మాట్లాడిన వైసీపీ నేతలపై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న మండిపడ్డారు. 76 ఏళ్ల ముసలోడివి నువ్వు.. ఎంతకాలం బతుకుతావ్‌?’ అని ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానిపై ధ్వజమెత్తారు. చందబాబుకు 76 ఏళ్ల వయసా?, ఎన్నాళ్లు ఉంటాడో చెప్పలేమా.. ఇలాంటి మాటలేనా మాట్లాడేది అని ఫైర్ అయ్యారు. తాను సీఎం చంద్రబాబును మొన్న ఢిల్లీలో చూశానని, 26 ఏళ్ల కుర్రాడిలా పరుగెత్తుతూ రాష్ట్రానికి కావాల్సిన నిధుల కోసం కేంద్ర మంత్రులను చకచకా కలుస్తారన్నారు. గతంలో వైఎస్ జగన్ దొంగచాటున ఢిల్లీ వెళ్లే వారని, 16 మందిలో ఆరుగురిని కలిసేవారని, మీడియాకు ఎలాంటి సమాచారం ఇచ్చేవారు కాదు, రాష్ట్రం గురించి ఏ రోజున ఢిల్లీలో మాట్లాడిన పాపాన పోలేదు అని బుద్దా వెంకన్న విమర్శించారు.

టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ… ‘కృష్ణా జిల్లాలో ఉన్న సైకోలు పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్‌లతో వైఎస్ జగన్ మాట్లాడిస్తున్నాడు. సీఎం చంద్రబాబు కృషి వల్ల ఏపీకి అనేక మంది పెట్టుబడి దారులు వస్తున్నారు. పరిశ్రమల ఏర్పాటు కోసం చాలా మంది ప్రభుత్వంపై నమ్మకంతో వచ్చారు. ఈ పరిస్థితుల్లో వంశీ నివాసంలో వారంతా కలిసి రాష్ట్రంలో అల్లర్లు చేసేందుకు కుట్రలు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం‌ కలిగిస్తే.. పెట్టుబడులు రావని నీచంగా వైసీపీ సైకోలు ఆలోచన చేస్తున్నారు. పేర్ని నాని రేషన్ బియ్యం బొక్కేసింది నిజం కాదా?, స్థలాలను కబ్జా చేసింది వాస్తవం కాదా?. నాడు నా భార్యను అరెస్ట్ చేయకుండా చంద్రబాబు ఆపారని చెప్పిన నువ్వే.. ఇప్పుడు జగన్ డైరెక్షన్‌లో నీచంగా మాట్లాడతావా?. దసరా ఉత్సవాల సమయంలో ‌పులి వేషగాళ్లు తరహాలో ఇప్పుడు వ్యవహరిస్తున్నారు. జనాల వద్ద మామూళ్లు వసూళ్లు చేసి‌ కోట్లాది రూపాయలు దోచుకున్న వ్యక్తులు మీరు’ అని మండిపడ్డారు.

‘కొడాలి నాని ఒంట్లో సామాన్లు మొత్తం చెడిపోయాయని వాళ్లే చెప్పారు. వంశీ ఇప్పటికే ఆస్పత్రి చుట్టూ తిరుగుతున్నాడు. రాత్రి సైగ చేయాలా.. రప్పా రప్పా అంటారా?. మా నాయకుడు అరగంట సమయం ఇస్తే మీ సంగతి ఏమిటో తేలుస్తాం. మీ అరాచకాలను అడ్డుకుని ధైర్యంగా నిలబడ్డ వ్యక్తులం మేము. మీలాగా డబ్బులు పుచ్చుకుని‌ నోరు పారేసుకునే వాళ్లం కాదు. మా నాయకుడి కోసం మా ప్రాణాలు అయినా ఇస్తాం. పేర్ని నానీ…‌లోకేష్ బాబును ఏమో అంటున్నావు?. ఇంకొకసారి చంద్రబాబు, లోకేష్‌లను అవమానంగా మాట్లాడితే సహించేది లేదు. జగన్ ఇప్పుడు బీసీల మీద కపట ప్రేమ చూపుతున్నాడు. మాచర్లలో నా మీద దాడి జరిగితే అప్పుడు బీసీలు గుర్తు లేదా. నా పై దాడి చేసిన తురకా కిషోర్‌కు మున్సిపల్ ఛైర్మన్ ఇచ్చావు. చంద్రయ్యను దారుణంగా చంపితే హంతకులను అరెస్టు చేయలేదే. ఇప్పుడు నువ్వా బీసీల గురించి మాట్లాడేది. డీజీపీ ఆధ్వర్యంలో ఏపీలో లా అండ్ ఆర్డర్ సక్రమంగా నడుస్తుంది. అటువంటి వ్యక్తిని డాన్ అంటావా?. పీఎస్సార్ ఆంజనేయులు అరాచకాలు నీకు‌ కనిపించ‌లేదా?. ఉండవల్లికి పీఎస్సార్ మంచోడు అంట.. ఎలా మంచోడో చెప్పాలి. చంద్రబాబు ఇంటి మీదకు వచ్చిన జోగి రమేష్‌కి మంత్రి పదవి ఇచ్చావు. అడ్డుకున్న మా‌మీద కేసులు పెట్టావు’ అని బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు.

Also Read: AP Chandrababu: ముగిసిన సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన!

‘వైఎస్ జగన్ 175 సీట్లు నావే అంటే ప్రజలు కేవలం 11 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు నీ సభలకు వచ్చేది కేవలం పిల్ల సైకోలు మాత్రమే. ప్రజలు ఎవ్వరూ నీ ముఖం‌ చూడటానికి కూడా ఇష్ట పడటం లేదు. నీ ఇంట్లోకి బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఎప్పుడైనా రానిచ్చావా?. రాష్ట్రం శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని జగన్, సైకోలు కుట్రలు చేస్తున్నారు. పెట్టుబడులు అడ్డుకోవాలని చూస్తే సహించం. చంద్రబాబు ముసలివాడు అంటారా.. ఆయన లాగా పని చేసే దమ్ము మీలో ఎవరికైనా ఉందా?. ఢిల్లీలో అందరినీ‌ కలిసి ఆ వివరాలు ప్రజలకు చెబుతున్నారు. మీ జగన్ ఢిల్లీ వెళ్ళి ఒక్కసారైనా ఏం చర్చ చేశారో చెప్పారా?. చంద్రబాబు, లోకేష్‌ల‌పై అనవసరంగా నోరు పారేసుకుంటే వారికి తగిన రీతిలో బుద్ది చెబుతాం’ అని బుద్దా వెంకన్న వార్నింగ్ ఇచ్చారు.

Exit mobile version