సార్వత్రిక ఎన్నికల వేళ బహుజన సమాజ్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ ఎంపీ సంగీతా ఆజాద్ బీజేపీ గూటికి చేరారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు.
సోమవారం ఢిల్లీలోని బీజేపీ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో బీఎస్పీ ఎంపీ సంగీతా ఆజాద్, అలాగే ఆ పార్టీ సీనియర్ లీడర్ ఆజాద్ అరి మర్దాన్, సుప్రీంకోర్టు న్యాయవాది సీమా సమృద్ధి (కుష్వాహ) కమలం గూటికి చేరారు. ఈ ముగ్గురికి మెడలో కండువా కప్పి పార్టీలోకి నడ్డా ఆహ్వానించారు.
త్వరలో దేశ వ్యాప్తంగా సార్వత్రికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కమలం పార్టీలోకి చేరికలు జోరందుకున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఆయా పార్టీలకు చెందిన ముఖ్యనేతలంతా కమలం గూటికి చేరిపోతున్నారు. ఇటీవల పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సతీమణి బీజేపీలో చేరారు. తాజాగా బీఎస్పీ ఎంపీ సంగీత పువ్వు పార్టీలో చేరారు.
ఇదిలా ఉంటే తెలంగాణ బీఎస్పీ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. బీఆర్ఎస్ తరపున సికింద్రాబాద్ లేదా నాగర్ కర్నూల్ నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
గత శనివారమే దేశ వ్యాప్తంగా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఏడు విడతల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 19న ప్రారంభమై.. జూన్ 1న పోలింగ్ ముగియనుంది. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి.
#WATCH | Delhi | BSP MP Sangeeta Azad, party leader Azad Ari Mardan and Supreme Court lawyer Seema Samridhi (Kushwaha) meet BJP national president JP Nadda after joining the party. pic.twitter.com/mlQl6Emkgx
— ANI (@ANI) March 18, 2024