NTV Telugu Site icon

Kavitha: కవితను కస్టడీలోకి తీసుకున్న సీబీఐ.. వాట్సప్ చాట్‌పై ప్రశ్నించే ఛాన్స్

Cbi

Cbi

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. మూడు రోజుల పాటు ఆమెను విచారించనున్నారు. ఇప్పటికే తీహార్ జైల్లో పలు ప్రశ్నలు సంధించారు. అయినా కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా ప్రశ్నించాలన్న నేపథ్యంలో తమ కస్టడీకి ఇవ్వాలని శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టును సీబీఐ కోరగా.. మూడు రోజుల పాటు విచారణకు అనుమతి ఇచ్చింది. ఢిల్లీ సీబీఐ కస్టడీలో కవితను అధికారులు విచారిస్తున్నారు.

కవితను సీబీఐ అధికారుల బృందంలో మహిళా అధికారులు విచారించనున్నారు. ఇప్పటికే లిక్కర్ పాలసీ కేసులో కవితనే కీలక సూత్రధారి, పాత్రధారిగా సీబీఐ పేర్కొంది. ఆమ్ ఆద్మీ పార్టీకి కవిత రూ.100 కోట్లు ముడుపులు ముట్టజెప్పినట్లు సీబీఐ వెల్లడించింది. సౌత్ గ్రూప్ నుంచి ఆమె డబ్బు సమకూర్చినట్లుగా తెలిపింది. నిందితులు అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన వాంగ్మూలాలు, వాట్సఫ్ చాట్స్‌పై ప్రధానంగా కవితను ప్రశ్నించనున్నట్లు సమాచారం. మౌఖికంగా, లిఖితపూర్వకంగా సీసీటీవి పర్యవేక్షణలో కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు.

ఇదిలా ఉంటే కవితను సోదరుడు కేటీఆర్ కలిసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ ఆదివారం ఢిల్లీ వెళ్లనున్నారు. సీబీఐ కస్టడీలో కవితను కలిసి పరామర్శించనున్నారు. కేటీఆర్‌తో పాటు పలువురు కుటుంబ సభ్యులు కూడా కలిసే అవకాశం ఉంది.