NTV Telugu Site icon

Padi kaushik Reddy: పోలీసులు 32 ప్రశ్నలు సంధించారు.. అన్నింటికీ సమాధానం చెప్పా!

Padi Kaushik Reddy

Padi Kaushik Reddy

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి మాసబ్‌ ట్యాంక్‌ పోలీసు స్టేషన్‌లో విచారణకు శుక్రవారం హాజరయ్యారు. హుజూరాబాద్‌ ఎమ్మెల్యే తన అడ్వకేట్‌తో కలిసి స్టేషన్‌ లోపలికి వెళ్లారు. ముందుగా అడ్వకేట్‌ను పోలీసులు అనుమతించలేదు. ఉన్నతాధికారుల అనుమతితో పోలీసులు లోపలికి అనుమతించారు. కౌశిక్‌ రెడ్డిని మాసబ్‌ ట్యాంక్‌ పోలీసులు గంటపాటు విచారణ చేశారు. పోలీసులు 32 ప్రశ్నలు అడిగి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు.

విచారణ ముగిసిన అనంతరం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘నాపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలపై ప్రశ్నిస్తే.. నాపై కేసులు పెడుతున్నారు. అయినా కూడా నేను భయపడను. 420 హామీలు, 6 గ్యారెంటీలపై ప్రశ్నిస్తునే ఉంటాను. డిసెంబర్ 4న నేను బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్ళాను. బంజారాహిల్స్ ఏసీపీ అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాను. నా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఫిర్యాదు చేయడానికి పోతే నాపై కేసులు పెట్టారు. నేను ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటి వరకు ఎందుకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదు’ అని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ప్రశ్నించారు.

Also Read: Revanth Reddy: సింగపూర్‌ విదేశాంగ మంత్రితో సీఎం రేవంత్‌ భేటీ!

‘పండుగ రోజు కూడా నన్ను దొంగ లాగ అరెస్ట్ చేసి తీసుకుపోయారు. ఈరోజు మాసబ్ ట్యాంక్ పోలీసులు 32 ప్రశ్నలు సంధించారు. అడిగిన ప్రశ్నే అడిగారు. నేను అన్నిటికీ సమాధానం చెప్పాను. విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తా. నేను చేసిన తప్పేమీ లేదు’ అని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చెప్పారు. గతేడాది డిసెంబర్‌ 4న ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు కౌశిక్‌ రెడ్డి వెళ్లారు. సీఐ వాహనానికి తన వాహనం అడ్డుపెట్టి.. అనుచరులతో హల్‌చల్‌ చేశారు. దీంతో పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడని ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు.