NTV Telugu Site icon

KTR: ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారు: కేటీఆర్

Ktr

Ktr

కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల సమాజంలోని అనేక వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయని, ఇదే పరిస్థితి రాష్ట్రంలో కొనసాగితే కేవలం ఆరు నెలల్లోని ప్రభుత్వంపైన ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రైతుబంధు, రుణమాఫీ, నిరుద్యోగ భృతి ఇంకా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీకి గ్రామం నుంచి రాష్ట్రస్థాయి దాకా పెద్ద ఎత్తున అన్ని స్థాయిలలో ప్రాతినిథ్యం ఉందని, ఇంతటి బలమైన పార్టీ తిరిగి గెలుపు బాట పట్టడం పెద్ద కష్టమేమి కాదని కేటీఆర్ పేర్కొన్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.

‘కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల సంఖ్య సరిగ్గా 420 ఉన్నాయి. ఈ 420 హామీలను ఎప్పటికప్పుడు ప్రజలకు, కాంగ్రెస్ పార్టీకి గుర్తు చేయాలి. డిసెంబర్ 9న ముఖ్యమంత్రి అవుతున్న అని చెప్పి.. రైతు రుణమాఫీ గురించి రేవంత్ రెడ్డి పదేపదే చెప్పారు. డిసెంబర్లో కరెంట్ బిల్లు సోనియా గాంధీ కడుతుందని చెప్పారు. రైతులకు 10,000 కాదు 15,000 ఇస్తా అన్నారు. రెండు వేల పెన్షన్ను 4,000 చేస్తా అన్నారు. వాటిని అమలు చేయమని గుర్తు చేస్తున్నాం. పాలమూరు, రంగారెడ్డికి జాతీయ హోదా సాధిస్తామని చెప్పారు. మొన్న ఉత్తంకుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు కేంద్ర జలవనరుల మంత్రిని కలిసిన తర్వాత జాతీయ ప్రాజెక్టు ఇవ్వడానికి వీలుల్లేదని చెప్పారు. జాతీయ హోదా మావల్ల కాదు అంటూ కాంగ్రెస్ పార్టీ చేతులు ఎత్తేసింది. ఈ విషయాన్ని మహబూబ్ నగర్ ప్రజలు గుర్తుంచుకోవాలి. మహబూబ్ నగర్ పక్కనే ఉన్న అప్పర్ బద్ర ప్రాజెక్టుకి కర్ణాటకలో జాతీయ హోదా ఇచ్చిన బీజేపీని నిలదీసే ప్రయత్నం ఉత్తమ్, కిరణ్ కుమార్ రెడ్డి చేయలేదు’ అని కేటీఆర్ అన్నారు.

‘ప్రియాంక గాంధీ 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. కానీ అసెంబ్లీ సాక్షిగా ఉపముఖ్యమంత్రి మాత్రం నిరుద్యోగ భృతి ఇవ్వలేదు అని చెబుతున్నారు. ఒకటేసారి రుణమాఫీ చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి మాటలకు భిన్నంగా ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి దశలవారీగా రుణమాఫీ చేస్తామంటున్నారు. గతంలో రోజుకు పది లక్షల మంది చొప్పున వారం రోజుల్లో 70 లక్షల మందికి రైతుబంధు ఇచ్చాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా రైతుబంధు రైతు ఖాతాలలోకి వస్తలేదు. ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల సమాజంలోని అనేక వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయి. ఎరువుల కోసం లైన్లో నిలబడే పరిస్థితులు మరలా వచ్చాయి. ఎరువులను పోలీస్ స్టేషన్లలో పెట్టి పంచే పరిస్థితి వచ్చింది. ఇలాంటి విషయాలను రైతులకు తెలియజేయాల్సిన బాధ్యత మాపైన ఉంది. ఇదే పరిస్థితి రాష్ట్రంలో కొనసాగితే కేవలం ఆరు నెలల్లోనే ప్రభుత్వంపైన ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుంది’ అని కేటీఆర్ చెప్పారు.

Also Read: Aroori Ramesh: పార్టీలు మారే చరిత్ర నాది కాదు.. అరూరి ఎప్పుడూ కేసీఆర్ మనిషే!

‘నాలుగు కోట్ల మంది ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ పార్టీకి తక్కువ వచ్చిన ఓట్లు కేవలం నాలుగు లక్షలు మాత్రమే. పార్టీకి గ్రామం నుంచి రాష్ట్రస్థాయి దాకా పెద్దఎత్తున అన్ని స్థాయిలలో ప్రాతినిథ్యం ఉంది. గ్రామపంచాయతీ నుంచి పార్లమెంటు దాకా ప్రతిచోట పార్టీకి బలమైన నాయకత్వం, ప్రాతినిథ్యం ఉంది. ఇంతటి బలమైన పార్టీ తిరిగి గెలుపు బాట పట్టడం పెద్ద కష్టమేమి కాదు. పార్టీపైన గతంలో జరిగిన దుష్ప్రచారాన్ని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మన పార్టీ నాయకులు, కార్యకర్తల పైన ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలు, రేషన్ కార్డులు, సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున ప్రజలకు అందించిన మనపైన విస్తృతమైన దుష్ప్రచారం జరిగింది. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాల లబ్ది నేరుగా ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా ఆయా కార్యక్రమాలను అమలు చేశాము. సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి వెళ్ళేటట్లు చేశాం. దీనివల్ల ప్రభుత్వం, పార్టీ అనే తేడాను ప్రజలు తెలుసుకోలేకపోయారు. ప్రజలకు కోసం చేసిన కార్యక్రమాలను కూడా బీఆర్ఎస్ పార్టీ ద్వారా జరిగిందనే విషయం చెప్పలేకపోయాం. భారీగా పెన్షన్లు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు అందించినా చెప్పుకోవడంలో కొంత విఫలమయ్యాం’ అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.