తెలంగాణలో ఎన్నికల సమయంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ పార్టీకి రిజైన్ చేశారు. ఈ మేరకు తన రాజీనామా లెటర్ ను నేడు సీఎం కేసీఆర్ కు పంపించారు. గత కొంత కాలంగా తీవ్ర అసంతృప్తిలో ఉన్న బాలసాని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే, బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ లక్ష్మీ నారాయణ.. హస్తం గుటికి చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది.
అయితే, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ బీఆర్ఎస్ పార్టీ వీడటంతో ఖమ్మం బీఆర్ఎస్ నేతలు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇన్నాళ్లు పార్టీ అధిష్టానం బాలసానికి సముచిత స్థానం కల్పించినప్పటికి.. ఇప్పుడు పార్టీకి ద్రోహం చేసి పోతున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు ఉంటే పార్టీలో అంతర్గతంగా చర్చించుకోవాలి కానీ, ఎన్నికల సమయంలో పార్టీకి రాజీనామా చేసి నష్టం చేకూర్చేలా ప్రవర్తించడం సరికాదని బీఆర్ఎస్ శ్రేణులు మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణపై విమర్శలు గుప్పిస్తున్నారు.