NTV Telugu Site icon

KTR-ED: ఈడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అరెస్ట్‌!

Brs Activists Arrested

Brs Activists Arrested

హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫార్ములా ఈ రేస్‌ కేసులో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో ఈడీ ఆఫీస్‌కు భారీ ఎత్తున బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. దీంతో ఈడీ ఆఫీస్‌ ముందు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాంతో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.

కేటీఆర్‌ ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో మాజీ మాత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్ బషీర్‌బాగ్‌ ఈడీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం ఈడీ కార్యాలయం ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 200 మంది పోలీసులు అక్కడ మోహరించారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా బాష్ప వాయువు, వాటర్‌ కెనాన్ల వాహనాలను కూడా పోలీసులు తెప్పించారు. కేటీఆర్ ఈడీ విచారణ ప్రారంభమైంది. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది.

జనవరి 7న ఈడీ విచారణకు కేటీఆర్‌ హాజరవాల్సి ఉంది. అయితే ఏసీబీ కేసును కొట్టివేయాలని దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఆ తీర్పు వచ్చేవరకు అవకాశం ఇవ్వాలని కేటీఆర్‌ కోరారు. దీంతో 16న విచారణకు హాజరుకావాలంటూ ఈడీ అధికారులు కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో నేడు విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఇప్పటికే అర్వింద్‌ కుమార్‌, బీఎల్‌ఎన్‌ రెడ్డిలను ఈడీ విచారించింది. వారు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈడీ అధికారులు కేటీఆర్‌ను విచారిస్తున్నారు.