NTV Telugu Site icon

Fire Accident : పెళ్లింట చావు బాజా.. వరుడితో సహ అక్కా చెల్లెళ్లు సజీవదహనం

West Bengal

West Bengal

Fire Accident : దురదృష్టం అంటే వీళ్లదే కావొచ్చు. మరికొద్దిరోజుల్లో పెళ్లి. కుటుంబం అంతా పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. సోదరుడి పెళ్లని అక్కా చెల్లెళ్లు వచ్చారు. ఇంతలోనే జరగకూడని ఘోరం జరిగిపోయింది.పెళ్ళిపీటలు ఎక్కాల్సిన యువకుడితో పాటు అతడి సోదరిమణులు సజీవదహనం అయ్యారు. దీంతో పెళ్లిబాజలు మోగాల్సిన ఇంట చావుబాజా మోగింది. పెళ్ళిపీటలు ఎక్కాల్సిన వరుడు పాడె ఎక్కాడు. సోదరుడి పెళ్లి చూద్దామని వచ్చిన శుభకార్యం కోసం పుట్టింటికి వచ్చిన అక్కాచెల్లెళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఇలా ముగ్గురు తోడబుట్టిన వాళ్లంతా మంటల్లో చిక్కుకుని మృతిచెందిన విషాద ఘటన పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకుంది.

Read Also:Brahmanandam: సెల్‌ఫోన్లు పక్కన పెట్టండి ప్లీజ్.. మాట్లాడొద్దంటే వెళ్ళిపోతా..

వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్ లోని బర్దమాన్ జిల్లా దుర్గాపూర్ కు చెందిన హప్నా సోరేన్ కు ముగ్గురు సంతానం. ఇద్దరు కూతుళ్లకు ఇప్పటికే పెళ్లికాగా కొడుకు మంగళ్ సోరెన్ కు ఇటీవలే మంచి పెళ్లి సంబంధం కుదిరింది. అమ్మాయి తరపు వారు నేడు(ఆదివారం) పెళ్లి ముహూర్తం పెట్టుకోవడానికి వస్తుండటంతో అక్కాచెల్లి సుమీ సోరెన్(35), బహమనీ సోరెన్(23) ఆనందంతో పుట్టింటికి వచ్చారు. నిన్న(శనివారం) తెల్లవారుజామున బయటకు వెళ్లిన హఫ్నా సోరెన్ తిరిగి ఇంటికి చేరుకుని మంటలు రావడం గమనించాడు. వెంటనే ఇంట్లోకి వెళ్లిచూడగా కొడుకుతో పాటు ఇద్దరు కూతుళ్లు మంటల్లో చిక్కుకుని సజీవదహనం అయి కనిపించారు. ఇలా ముగ్గురు బిడ్డలు ఒకేసారి చనిపోవడంతో ఆ తండ్రి కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దహనమైన మృతదేహాలను సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు. వారిది హత్యా… ఆత్మహత్యా… ప్రమాదమా? అన్నది తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. హఫ్నా సోరెన్ మాత్రం తమ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేవని… అసలేం జరిగిందో తెలియడం లేదంటూ పోలీసుల ఎదుట కన్నీటి పర్వంతం అయ్యాడు.

Read Also:IPL 2023 Final: ఐపీఎల్‌లో మిస్టర్‌ కూల్ అరుదైన రికార్డు