రాబందుల గురించి మనం ఎప్పుడో విన్నాం.. శవాలను పీక్కుతినడం మనం చూశాం. కానీ పోస్టుమార్టం చేయడం కోసం డబ్బులు డిమాండ్ చేసిన ఆసుపత్రి సిబ్బంది ఉదంతం తెలంగాణలో హాట్ టాపిక్ అవుతోంది. నాకే కాదు పైన చాలామందికి ఇవ్వాలి అని అంటున్న సిబ్బంది.. అసలే కొడుకు పోయిన బాధలో ఉన్న తల్లిదండ్రులను లంచం కోసం వేధించారు ఆస్పత్రి సిబ్బంది. రెండువేలు ఇచ్చే వరకు వదిలిపెట్టలేదు సిబ్బంది. ఫోన్ పే చేయించుకున్న సిబ్బంది పోస్ట్ మార్టం చేశారు. కూలి కుటుంబం నుంచి డబ్బులు వసూలు చేసిన సిబ్బంది తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆత్మహత్య చేసుకున్న యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం చేసేందుకు, మృతదేహాన్ని అప్పగించేందుకు డబ్బులు డిమాండ్ చేసిన వైనం ఇది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఏరియా ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. అశ్వరావుపేటకు చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పశువుల కాపరిగా ఉండే యడ్లపల్లి సురేందర్ తన మొబైల్ ఫోన్ లో నెట్ బ్యాలెన్స్ రీఛార్జ్ చేయించుకునేందుకు తల్లిని డబ్బులు అడిగాడు. కూలి డబ్బులు వచ్చిన తర్వాత ఇస్తానని తల్లి చెప్పడంతో మనస్థాపం చెంది అదే రోజు రాత్రి పురుగుల మందు తాగాడు. విషయాన్ని గమనించిన కుటుంబీకులు హుటాహుటిన అశ్వారావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Read Also:Missing Child: బాలిక మిస్సింగ్.. 24 గంటలు గడుస్తున్నా లభించని ఆచూకీ..
కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడ్డ యడ్లపల్లి సురేంద్రకు ఎనిమిది నెలల క్రితమే వివాహం జరిగింది.మృతదేహం కొత్తగూడంకి వచ్చింది కొత్తగూడెం హాస్పిటల్లో పోస్ట్ మార్టం చేసేందుకు డబ్బులు డిమాండ్ చేశారు. తొలుత మూడువేలు ఇవ్వాలని సిబ్బంది డిమాండ్ చేశారు. అయితే తమ దగ్గర వెయ్యిరూపాయలు మాత్రమే ఉన్నాయని ఆ వెయ్యి రూపాయలు ఇవ్వటానికి ప్రయత్నం చేస్తే తిరస్కరించారు. చివరికి ఫోన్ పే ద్వారా మిగతా అమౌంట్ తన ఖాతాలో వేయించుకున్నారు సిబ్బంది. అయితే ఇది తన ఒక్కడికే కాదని మేము ఇంకా చాలామందికి ఇవ్వవలసి ఉంటుందని ఆ సిబ్బంది చెబుతున్న వీడియో ఒకటి వెలుగు చూసింది. గురువారం జరిగిందీ ఘటన. దీనిపై వైద్యశాఖ అధికారులు, వైద్యమంత్రి ఎలా స్పందిస్తారో చూడాలి మరి.
Read Also: Aishwarya: ముగ్గురు పిల్లలకు తల్లి కాబోతున్న ఐశ్వర్య