RJD Leader Yaduvansh Kumar Yadav: రాష్ట్రీయ జనతాదళ్ (RJD) జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే యదువంశ్ కుమార్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్రాహ్మణులు భారతదేశానికి చెందినవారు కాదని, వాస్తవానికి రష్యా, ఇతర యూరోపియన్ దేశాలకు చెందినవారని ఆయన ఆరోపించారు.బీహార్‌లోని సుపాల్‌లో శనివారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో యదువంశ్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. “యాదవ సమాజం ఈ దేశానికి చెందినది, బ్రాహ్మణుల డీఎన్‌ఏ పరీక్షలో ఈ దేశానికి చెందినవారు కాదని, రష్యా, ఇతర యూరోపియన్ దేశాలకు చెందిన వారని తేలింది. ఇప్పుడు ఇక్కడ స్థిరపడ్డారు. బ్రాహ్మణులు మనల్ని విభజించి పాలించడానికి ప్రయత్నిస్తున్నారు. వారిని ఇక్కడి నుంచి తరిమికొట్టడం ముఖ్యం.” అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.
యదువంశ్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఆర్జేడీ మిత్రపక్షమైన జనతాదళ్ (యునైటెడ్)కి మింగుడుపడలేదు. పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ కుమార్ ఝా ఆర్‌జేడీ నేత చేసిన వ్యాఖ్యలు దారుణం.. పరశురాముడు రష్యా నుంచి వచ్చాడా లేక మరేదైనా దేశం నుంచి వచ్చాడా.. మీడియాలో ఉండేందుకు ఆర్జేడీ నేతలు ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి నేతలపై ఆర్జేడీ చర్యలు తీసుకోవాలని, ఆర్జేడీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా మహాఘటబంధన్ ప్రతిష్టను కూడా దెబ్బతీస్తున్నారని అభిషేక్ కుమార్ ఝా అన్నారు.
Read Also: Explosion: కెమికల్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. ఐదుగురు దుర్మరణం
వివాదాస్పద ప్రకటనలు చేయడానికి కూటమి భాగస్వాముల మధ్య పోటీ ఉందని, బీహార్‌లో అధికారంలో ఉన్న మహాఘటబంధన్‌పై బీజేపీ అవహేళన చేసింది.”ఆర్జేడీ నాయకుడి మానసిక స్థితి నిలకడగా లేదని నేను భావిస్తున్నాను. ఈ ప్రాంతానికి చెందిన ఆర్జేడీ నాయకుడు మనోజ్ కుమార్ ఝా, జనతాదళ్ (యునైటెడ్) నాయకుడు సంజయ్ ఝా బ్రాహ్మణులు అసలు దేశంలో ఉన్నారా లేదా వేరే వారి నుండి వచ్చారా అని వివరించాలి. ” అని బీజేపీ శాసనసభ్యుడు నీరజ్ కుమార్ బబ్లూ అన్నారు.ఈ ఏడాది జనవరిలో బీహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ రామాయణం ఆధారంగా రూపొందించిన రామచరిత్ మానస్ అనే హిందూ మత గ్రంథం ‘సమాజంలో ద్వేషాన్ని వ్యాపింపజేస్తుంది’ అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన వ్యాఖ్యలను ప్రతిపక్ష పార్టీలతో పాటు బీహార్‌లోని ఆర్జేడీ మిత్రపక్షమైన జేడీ(యూ) కూడా విమర్శించాయి.
