ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో మ్యాచ్ ఆడొద్దని భారత ఫాన్స్ మండిపడుతున్నారు. బాయ్‌కాట్ ఆసియా కప్ 2025, బాయ్‌కాట్ భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ అని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఐసీసీ, ఏసీసీ నిబంధనల మేరకు ఆడుతున్నామని బీసీసీఐ పెద్దలు చెప్పుకొస్తున్నారు. మరోవైపు సుప్రీంకోర్టు కూడా అది కేవలం అట మాత్రమే అని పేర్కొంది. అయినా కూడా అభిమానుల్లో ఆగ్రహం తగ్గడం లేదు. ‘బాయ్‌కాట్ ఆసియా కప్’ అని కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఎక్స్ లో ‘బాయ్‌కాట్ ఆసియా కప్’ అని ట్రెండ్ అవుతోంది.
అభిమానుల మండిపాటుతో బీసీసీఐ పెద్దలు కాస్త వెనకడుగు వేసే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దుబాయ్ వేదికగా ఆదివారం రాత్రి జరిగే భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు దూరంగా ఉండాలని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నారట. మ్యాచ్‌కు ఒక్కరిని మాత్రమే ప్రతినిధిగా పంపింనట్లు తెలుస్తోంది. దుబాయ్‌కు బీసీసీఐ నుంచి ఒకరు మాత్రమే చేరుకున్నారని, మిగతావారెవరూ రాలేదని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. భారత అభిమానుల ఆగ్రహం కారణంగానే బీసీసీఐ ఇలా వెనకడుగు వేసినట్లు సమాచారం.
గత జూన్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ చూసేందుకు పెద్ద సంఖ్యలో బీసీసీఐ పెద్దలు హాజరయ్యారు. అంతేకాదు రాష్ట్ర సంఘాల ప్రతినిధులు కూడా మ్యాచ్ ప్రత్యక్షంగా చూశారు. ప్రస్తుతం అందరూ సైలెంట్ అయ్యారు. ఫాన్స్ ఎన్ని కామెంట్స్ చేసినా బీసీసీఐ ‘సైలెంట్’గా ఉంటోంది. భారత్, పాకిస్థాన్ టీమ్స్ తమ మొదటి మ్యాచ్లలో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ కీలక పోరులో ఎవరు గెలుస్తారో చూడాలి. భారత్ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
