NTV Telugu Site icon

Rohit Sharma Captaincy: రోహిత్ కెప్టెన్సీ అస్సలు బాలేదు.. టీమిండియా మాజీ హెడ్ కోచ్ ఫైర్!

Rohit Sharma

Rohit Sharma

రోహిత్ శర్మ కెప్టెన్సీపై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఫైర్ అయ్యారు. సారథిగా రోహిత్ తీసుకుంటున్న నిర్ణయాలు సరిగ్గా లేవని, బౌలర్లను సద్వినియోగం చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జట్టులో ఇద్దరు స్పిన్నర్లను ఎందుకు తీసుకున్నారని, 40 ఓవర్ల తర్వాత బౌలింగ్‌కు తీసుకురావడం అవసరమా? అని ప్రశ్నించారు. ఫీల్డింగ్‌ సెటప్ కూడా సరిగ్గా లేదని రవిశాస్త్రి మండిపడ్డారు. మెల్‌బోర్న్‌ టెస్టులో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 474 పరుగులకు ఆలౌట్ అయింది. స్టీవ్‌ స్మిత్ (140) సెంచరీ చేయగా.. మార్నస్ లబుషేన్, ఉస్మాన్ ఖవాజా, సామ్‌ కాన్‌స్టాస్‌ హాఫ్ సెంచరీలు బాదారు.

మొదటి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ మూడు పరుగులకే ఔట్ అయ్యాడు. బ్యాటర్‌గా విఫలమవుతూ వస్తోన్న రోహిత్.. కెప్టెన్‌గానూ సరైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతున్నాడు. బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న రవిశాస్త్రి.. రోహిత్ కెప్టెన్సీ అస్సలు బాలేదని పేర్కొన్నారు. ‘ఎందుకు తుది జట్టులో ఇద్దరు స్పిన్నర్లను తీసుకున్నారు. 40 ఓవర్ల తర్వాత వారిని బౌలింగ్‌కు తీసుకురావడం అవసరమా?. మెల్‌బోర్న్‌లో స్పిన్నర్లు, పేసర్లు ఒక్కో ఓవర్‌ వేయాలి. జడేజా, సుందర్‌కు రోహిత్ ఆలస్యంగా బౌలింగ్‌ ఎందుకు ఇచ్చాడో అర్థం కావడం లేదు’ అని అన్నారు.

Also Read: Steven Smith Century: టీమిండియా అంటేనే ఊపొస్తుంది.. స్టీవ్‌ స్మిత్‌ ప్రపంచ రికార్డు!

‘ఈరోజు భారత బౌలింగ్‌ను జస్ప్రీత్ బుమ్రాతో ప్రారంభిస్తే బాగుండు. రోహిత్ బంతిని బుమ్రాకే కాకుండా మహమ్మద్ సిరాజ్‌ చేతికి ఇచ్చాడు. మూడో ఓవర్‌లో బుమ్రాను బౌలింగ్‌కు తీసుకొచ్చాడు. సిరాజ్‌ ఆత్మవిశ్వాసంతో లేడు. ఇలాంటి సందర్భంలో అతడిని సరిగ్గా హ్యాండిల్ చేయాలి. మిచెల్ స్టార్క్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడూ ఫీల్డింగ్‌ సెటప్ సరిగ్గా లేదు. భారత ఫీల్డర్లు చురుగ్గా లేరు’ అని రవిశాస్త్రి ఫైర్ అయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా 23 ఓవర్లు వేసి 3 వికెట్లు పడగొట్టాడు. వాషింగ్టన్ సుందర్ 15 ఓవర్లు వేసి.. ఒక వికెట్ తీశాడు.

Show comments