గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలపై వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సీరియస్ అయ్యారు. రుషికొండ రిసార్ట్స్ ను మెంటల్ హాస్పిటల్ చేయాలన్న వ్యాఖ్యలపై బొత్స ఫైర్ అయ్యారు. అశోక్ వ్యాఖ్యలు అహంకారం, అహంభావానికి నిదర్శనం అని మండిపడ్డారు. అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలు ఆయన మానసిక స్థితికి నిదర్శనం అని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఎటువంటి వారికి గవర్నర్ పదవి ఇచ్చిందో అర్థం చేసుకోవచ్చు అని బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. ప్రజాధనంతో నిర్మించిన రుషికొండ ప్యాలెస్‌ను పిచ్చి ఆసుపత్రిగా మార్చాలని గోవా గవర్నర్ అశోక్‌గజపతి రాజు సలహా ఇచ్చారు. క్షత్రియ సేవాసమితి ఆధ్వర్యంలో బుధవారం విశాఖలో సన్మాన సభ ఏర్పాటు చేయగా.. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘విశాఖలో ప్రజాధనంతో కట్టిన రుషికొండ ప్యాలెస్ పెచ్చులు ఊడిపోయాయని నాకు తెలిసింది. ప్యాలెస్ కట్టడానికి రూ.600 కోట్లు అయింది. ఆ డబ్బే ఉంటే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తయ్యేది. ఈ ప్యాలెస్‌ను ఎలా వాడాలని ప్రభుత్వం ప్రజలను అడుగుతోంది. రుషికొండ ప్యాలెస్‌ను పిచ్చి ఆసుపత్రి చేస్తే మంచిదని నా సలహా. దానిని కట్టిన దుర్మార్గులకి ఆ సముద్ర గాలి తగులుతుంది. రుషికొండ భవనాల ద్వారా ఏ ఆదాయం రాదు. ప్రజాధనాన్ని ప్రజా హితం కోసం వాడాలి’ అని గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు అన్నారు. ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సీరియస్ అయ్యారు.
Also Read: Samyuktha Menon: ప్రపంచం విజయవాడ వైపు చూడాలనే ఈ ఉత్సవ్!
‘అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలు అహంకారం, అహంభావానికి నిదర్శనం. పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో కానీ పోవు. రుషికొండపై అశోక్ వ్యాఖ్యలు ఆయన మానసిక స్థితికి నిదర్శనం. కూటమి ప్రభుత్వం ఎటువంటి వారికి గవర్నర్ పదవి ఇస్తుందో అర్ధం చేసుకోవచ్చు. మా ప్రాంతం వ్యక్తికి గవర్నర్ పదవి వచ్చిందని సంతోషించాం.. కానీ ఆయన వ్యాఖ్యలు చూస్తే బాధ కలుగుతుంది’ అని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు.
