BSF Inspector: పశ్చిమ బెంగాల్‌లోని కిషన్‌గంజ్ ప్రాంతంలోని సరిహద్దు ఔట్‌పోస్టు వద్ద మహిళా కానిస్టేబుల్‌పై అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఒక బీఎస్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్ సస్పెండ్ చేయబడ్డారు. అతనిపై శాఖాపరమైన విచారణ ప్రారంభించినట్లు బీఎస్‌ఎఫ్ సీనియర్ అధికారి మంగళవారం తెలిపారు. నదియా జిల్లా ఔట్‌పోస్ట్‌లోని తుంగి సరిహద్దు వద్ద నియమించబడిన ఇన్‌స్పెక్టర్ ఫిబ్రవరి 19న ప్రాంగణంలో మహిళా బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్‌పై అత్యాచారానికి పాల్పడ్డారని ఆయన తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కునాల్ ఘోష్ దీనిపై స్పందించాలని బీజేపీ బెంగాల్ యూనిట్‌ను కోరిన తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఇన్‌స్పెక్టర్ సస్పెండ్ చేయబడ్డాడని, అతనిపై శాఖాపరమైన విచారణ జరుగుతోందని బీఎస్‌ఎఫ్ అధికారి వెల్లడించారు. మహిళా కానిస్టేబుల్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం పంపించారు. ఆమె ఫిర్యాదు ప్రకారం ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. డిపార్ట్‌మెంటల్ విచారణ ముగిసే వరకు బీఎస్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్ గురించి మరిన్ని వివరాలను వెల్లడించడానికి బీఎస్‌ఎఫ్ అధికారి నిరాకరించారు. ఈ ఆరోపణలు నిజమైతే అతనిని చట్టం ప్రకారం శిక్షిస్తామని పేర్కొన్నారు.
Read Also: Missing girls: మిస్టరీగానే బాలికల మిస్సింగ్ కేసు.. ఇంకా దొరకని ముగ్గురి ఆచూకీ
కునాల్ ఘోష్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ప్రస్తావించారు. కృష్ణాగంజ్, నదియా క్యాంప్‌లో బీఎస్‌ఎఫ్ కమాండర్ ఒక లేడీ బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్‌పై అత్యాచారం చేశారని ఆరోపించారు. ఇప్పుడు బీజేపీ ఏం చెబుతుందని ఆయన ప్రశ్నించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2021లో బీఎస్‌ఎఫ్ చట్టాన్ని సవరించి, పంజాబ్, పశ్చిమ బెంగాల్, అస్సాంలోని అంతర్జాతీయ సరిహద్దు నుంచి 15 కి.మీల దూరంలో కాకుండా, 50 కి.మీ.ల పరిధిలో శోధన, స్వాధీనం, అరెస్టులను చేపట్టడానికి అధికారాన్ని బీఎస్‌ఎఫ్‌కు ఇచ్చింది. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అధికార టీఎంసీ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయడంతో బెంగాల్‌లో ఇది ప్రధాన రాజకీయ సమస్యగా మారింది.