NTV Telugu Site icon

Palnadu: పల్నాడు జిల్లాలో బాంబులు, కత్తులు, వేట కొడవళ్లు కలకలం

Palnadu

Palnadu

Palnadu: ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో పల్నాడు జిల్లాలో బాంబులు, కత్తులు, వేటకొడవళ్లు బయటపడడం కలకలం సృష్టిస్తోంది. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం జంగమహేశ్వరపాడులో నిర్మాణంలో ఉన్న ఒక ఇంట్లో బాంబులు, కత్తులు, రాడ్లను దుండగులు దాచిపెట్టారు. 17 బాంబులు, 3 వేట కొడవల్లు, 3 బరిసెలు, ఒక చిప్ప గొడ్డలి, ఇనుప రాడ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని అక్కడ ఎవరు దాచి ఉంచారన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read Also: CPI Narayana: తెలుగు ప్రజలకు మోడీ క్షమాపణ చెప్పాలి.. సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు

ఎన్నికల్లో మాచర్ల నియోజకవర్గంలో గొడవలు సృష్టించేందుకు రౌడీ మూకలు సిద్ధపడ్డట్లు పోలీసులతో పాటు స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ నెల 11 న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాచర్ల పర్యటన ఉన్న నేపథ్యంలో బాంబుల, కత్తులు దాచిఉంచడంపై టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ రోజున పటిష్ట భద్రత కల్పించాలని పలుమార్లు ఎన్నికల సంఘానికి ఇరు పార్టీల నేతలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మాచర్లలో ఎన్నికలు నిర్వహించడం పోలీసులకు సవాలుగా మారింది.