తన తండ్రి కోసం ఎన్నికల ప్రచారంలో చిరుత హీరోయిన్ నేహా శర్మ దూసుకుపోతున్నారు. ఓపెన్ టాప్ వాహనంలో తన తండ్రితో కలిసి ఎన్నికల క్యాంపెయిన్ చేస్తున్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో ఆమె పంచుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఓ రోడ్ షోలో నేహా పాల్గొన్న వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నేహా కూడా రాజకీయ ఆరంగేట్రం చేస్తుందన్న వార్తలు తొలుత వినిపించినా ఆమె తన సినీ కెరీర్ మీదే ప్రస్తుతానికి ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. నేహాను రాజకీయాల్లోకి రావాలంటూ తండ్రి ప్రోత్సహించినప్పటికీ ఆమె నటన మీదే దృష్టిపెట్టాలని నిర్ణయించుకున్నారు.
నేహా తండ్రి అజిత్ శర్మ ఉత్తరప్రదేశ్‌లోని భగల్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున బరిలో ఉన్నారు. జేడీయూ నేత అజయ్ కుమార్‌తో ఆయన తలపడుతున్నారు. ఇక తండ్రి తరుపున నేహా.. కిషన్ గంజ్, బంకా, కటీహార, పూర్నియా తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. సంప్రదాయ సల్వార్ కమీజ్ దుస్తుల్లో రోడ్ షోలు, ర్యాలీల్లో పాల్గొన్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ, ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తూ ముందుకు సాగారు.
ప్రచారానికి సంబంధించిన పలు వీడియోలను నేహా శర్మ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిన వారు శాశ్వతంగా నిలిచిపోతారని ఆమె వ్యాఖ్యానించారు. మీ ప్రేమ మద్దతుతో తన మనసంతా సంతోషంతో నిండిపోయిందని.. ఇంతటి స్వాగతం ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ ఆమె వీడియోను షేర్ చేశారు. భగల్‌పూర్‌లో పోలింగ్ రెండో దశలో ఏప్రిల్ 26న జరగనుంది.
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగుతుంది. తొలి విడత ఏప్రిల్ 19న ముగిసింది. సెకండ్ ఏప్రిల్ 26న జరగనుంది. అనంతరం మే 7, 13, 20, 25, జూన్ 1న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి. ఇక ప్రచారంలో ఆయా పార్టీలు దూసుకుపోతున్నాయి. ఇక ఉత్తరప్రదేశ్‌లో 40 మందితో కూడిన జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. ఇందులో సోనియా గాంధీ ఉన్నారు.
Bihar, Bhagalpur: Bollywood actress Neha Sharma campaigns for Congress leader and father Ajeet Sharma in the Lok Sabha elections, participates in a roadshow. pic.twitter.com/yEhb4XoQQL
— IANS (@ians_india) April 23, 2024