ఉస్మానియా విశ్వవిద్యాలయం అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సాధన కోసం ఉద్యోగులు ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారం, పది రోజుల్లోగా ఉద్యోగుల సీపీఎస్ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని స్పష్టం చేశారు. ఇందుకోసం రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శితో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విశ్వవిద్యాలయాలు సమాజానికి దిక్సూచిగా నిలవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు.
Also Read : IT and ED Raids in Telangana: తెలంగాణపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఫోకస్.. ఈడీ తదుపరి టార్గెట్ ఎవరు?
విద్యార్థులను రాజకీయాలకు దూరం చేయటమే పెద్ద కుట్రగా అభివర్ణించిన ఆయన…. విద్యా సంస్థల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలు ఉండాల్సిందేనని అన్నారు. చదువుతో పాటు సమస్యలపై చర్చ, సైద్ధాంతిక చర్చ జరగకపోతే యూనివర్శిటీల ప్రాధాన్యత ఎమిటని ప్రశ్నించారు. ఉత్తర భారతంలో ఉన్న అస్పృశ్యత, వెనకబాటుతనం దక్షిణాదిలో.. ప్రత్యేకంగా తెలంగాణలో లేకపోవటానికి కారణం…. ఇక్కడ జరిగిన ప్రజాస్వామిక, ప్రగతిశీల ఉద్యమాలే కారణమని చెప్పుకొచ్చారు. ఇవ్వాలో రేపో యూనివర్శిటీ రిక్రూట్ మెంట్ బోర్డు మనుగడలోకి వస్తుందని… వెంటనే నియామకాల ప్రక్రియ ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. నిస్పక్షపాతంగా నియామకాలు చేపడతామని…. ఏవైనా అనుమానాలుంటే వ్రాతపూర్వకంగా తెలపాలని అధ్యాపకులను కోరారు.
Also Read : Palnadu News : పల్నాడు జిల్లాలో దారుణం.. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య
అధ్యాపకులు, ఉద్యోగులకు సీపీఎస్ సాధించిపెట్టే బాధ్యత తనదేనని ఈ సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ డి. రవిందర్ యాదవ్ హామీ ఇచ్చారు. ఇందుకోసం ఎన్ని సార్లైనా ప్రభుత్వ యంత్రాంగంతో చర్చించి పరిష్కరిస్తామని తెలిపారు. ఏ సమస్యనైనా చర్చల ద్వారా, సామరస్యపూర్వకంగా, ప్రేమతో సులువుగా సాధించవచ్చని స్పష్టం చేశారు. ఇదే సందర్భంగా వేగంగా వస్తున్న ఆధునికతకు అనుగుణంగా మనమంతా అప్ గ్రేడ్ కావాలని పిలుపునిచ్చారు. సంస్కరణలను ఆహ్వానిస్తూనే ప్రతి ఒక్కరూ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. యూజీసీ నిబంధనల మేరకు త్వరలోనే ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ కు ఈసీలో అనుమతి తూసుకుంటామని అన్నారు. తద్వారా సమాజంలోని ఆయా రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తుల అనుభవాన్ని, పరిఙానాన్ని తరగతి గదుల్లో వినియోగించుకుంటామని వెల్లడించారు. ఎంతో ప్రతిభ, అనుభవం కలిగిన వినోద్ కుమార్ కూడా ఉస్మానియా విద్యార్థుల కోసం సమయం కేటాయించాలని కోరారు.
అంతకు ముందు కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన ప్రాఫెసర్ కాశీం….సమాజం కోసం, విద్యార్థుల కోసం, విశ్వవిద్యాలయం కోసం కమిట్ మెంట్ తో పనిచేస్తున్న తమకు సీపీఎస్ విధానంతో పాటు పీఆర్సీ బకాయిలు చెల్లించాలని వినోద్ కుమార్ ద్వారా ప్రభుత్వాన్ని కోరారు. ప్రొఫెసర్ల పదవీవిరమణ వయస్సును 65 ఏళ్ళకు పెంచటంతో పాటు, పే రివిజన్, సీపీఎస్ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అన్నారు. ఎంతో మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులను చేసిన కర్మాగారం ఉస్మానియా విశ్వవిద్యాలయమని యూజీసీ వ్యవహారాల డీన్ ప్రొఫెసర్ జి. మల్లేశం అన్నారు. దేశమంతా పాత పెన్షన్ విధానం వైపు వెళ్తుంటే…. మేం ఇంకా సీపీఎస్ ఇవ్వమని అడుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సత్వరమే ఓయూ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
న్యాయబద్దంగా ప్రభుత్వమే విడుదల చేసిన జీవోలను అమలు చేయాలని మాత్రమే తాము కోరుకుంటున్నట్లు…ఓయూ ఎన్జీఓస్ అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ అన్నారు. ఇప్పటికీ తమ సమస్యలు పరిష్కరిస్తారనే నమ్మకం ప్రభుత్వంపై ఉందని…. తామంగా తెలంగాణ ఉద్యమంలో ముందువరుసలో ఉండి పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు. అనుమానాలకు స్వస్తి పలికి ప్రభుత్వం ఓయూతో కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.
