Kejriwal Arrest: జర్మనీ జోక్యంపై కేంద్రం ఆగ్రహం

Kejriwal

Kejriwal

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్‌పై జర్మనీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా మండిపడింది. ఇది మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే అవుతుందని కేంద్ర విదేశాంగ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేజ్రీవాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటనపై జర్మనీ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన పెను దుమారం రేపింది. కేజ్రీవాల్‌ విచారణ పారదర్శకంగా జరగాలంటూ జర్మనీ విదేశాంగ ఓ ప్రకటనలో తెలిపింది. దీనిపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. శనివారం ఢిల్లీలోని జర్మనీ రాయబారిని కేంద్ర విదేశాంగ శాఖ పిలిచి నిలదీసింది. వారి ఎదుట నిరసన వ్యక్తం చేసింది.

కేజ్రీవాల్‌ అరెస్ట్‌పై జర్మనీ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి శుక్రవారం ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. భారత్‌ ప్రజాస్వామ్య దేశమని… ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్‌ న్యాయపరమైన, నిష్పాక్షికమైన విచారణకు అర్హులు అని పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న చట్టపరమైన మార్గాలను ఎలాంటి పరిమితులు లేకుండా ఆయన వినియోగించుకోవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ ప్రకటనపై కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని ఆ దేశ రాయబారికి సమన్లు పంపింది. దీంతో ఈ ఉదయం జర్మనీ ఎంబసీ డిప్యూటీ హెడ్‌ జార్జ్‌ ఎంజ్‌వీలర్‌ కేంద్ర విదేశాంగ శాఖ కార్యాలయానికి వచ్చారు. ఆయన ఎదుట భారత్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ విధానం మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని మండిపడింది.

ఢిల్లీ లిక్కర్ కుంభకుణంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ఆయన్ను కోర్టులో హాజరుపర్చగా.. ఏడు రోజులు ఈడీ కస్టడీకి అనుమతిచ్చింది. ఈ కేసులో కేజ్రీవాల్‌కు తొమ్మిది సార్లు ఈడీ సమన్లు జారీ చేసింది. కానీ ఒక్కసారి కూడా ఆయన విచారణకు హాజరుకాలేదు. తనను అరెస్ట్ చేయకుండా ఈడీ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించినా ప్రయోజనం దక్కలేదు. అరెస్ట్ విషయంలో జోక్యం చేసుకోలేమంటూ న్యాయస్థానం తేల్చి చెప్పడంతో కొన్ని నిమిషాల్లోనే అధికారులు కేజ్రీవాల్ నివాసాని చేరుకుని అరెస్ట్ చేశారు.