Site icon NTV Telugu

America Police: అమెరికా పోలీసుల చేతిలో మరో నల్లజాతీయుడు హతం.. వీడియో వైరల్

America

America

America Police: అగ్రరాజ్యమైన అమెరికాలో నల్లజాతీయులపై దాడులు ఆగడం లేదు. యూఎస్‌లో ఓ నల్లజాతీయుడిపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. మే 2020లో జార్జ్ ఫ్లాయిడ్ అనే యువకుడిని పోలీసులు చితకబాదడంతో అతను మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా అదే తరహాలో టైర్ నికోలస్ అనే నల్ల జాతీయుడిపై అమెరికా పోలీసులు తీవ్రంగా దాడి చేయడం వల్ల అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన అమెరికా వ్యాప్తంగా నిరసనలకు కారణం అయ్యింది. అయితే అతడిపై పోలీసులు దాడి చేస్తున్నప్పటి సమయంలో స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో పలు దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఆ దృశ్యాలు తాజాగా బయటకు వచ్చాయి. అందులోని ఫుటేజ్ ఎంతో మందికి కన్నీళ్లు తెప్పిస్తోంది. పోలీసులు కొడుతున్నప్పుడు అందులో ‘అమ్మా అమ్మా‘ అని అరవడం వినిపిస్తోంది.

మెంఫిస్ అనే ప్రాంతంలో ర్యాష్‌ డ్రైవింగ్ చేశాడని పేర్కొంటూ జనవరి 7న రాత్రి సమయంలో టైర్‌ నికోలస్‌ అనే నల్లజాతీయుడిని అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. అతడు పారిపోయేందుకు చూశాడని.. అందుకే నికోలస్‌ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. అనంతరం నికోలస్‌ను పోలీసులు చితకబాదారు. అమ్మా అమ్మా అని అరుస్తున్నా పట్టించుకోకుండా నిర్ధాక్షిణ్యంగా చావబాదారు. దీంతో నికోలస్ జనవరి 10న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అతడి మరణంతో అమెరికాలో నిరసనలు వ్యక్తం అయ్యాయి.

Imran khan: నన్ను హతమార్చేందుకు మళ్లీ కుట్ర.. ఇమ్రాన్‌ఖాన్‌ సంచలన ఆరోపణలు

పోలీసులు నికోలస్ పై చేసిన అనుచిత ప్రవర్తనకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. అందులో వారి సంభాషణ కూడా వినిపిస్తోంది. నికోలస్ ను పట్టుకున్న సమయంలో పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. ముందుగా ఓ పోలీసు అధికారి అతడిని డ్రైవింగ్ సీట్లో నుంచి బయటకు లాగారు. తరువాత మిగతా పోలీసులు తీవ్రంగా దాడి చేశారు. ఈ సమయంలో నికోలస్ మాటలు కూడా రికార్డయ్యాయి. తానేం తప్పు చేయలేదని, ఇంటికి వెళ్తున్నానని అందులో చెబుతున్నాడు. అయినా కూడా పోలీసులు వినకుండా అతడిని రోడ్డుపై పడేసి చితకబాదారు. పెప్పర్​ స్ప్రే కూడా ఉపయోగించారు. పోలీసులు కొడుతున్నప్పుడు బాధితుడు ‘‘అమ్మా, అమ్మా’’ అని అరుస్తున్నాడు. తీవ్రంగా రోధించాడు. ఇవి అందరినీ కంట నీరు పెట్టుకునేలా చేస్తున్నాయి. తనను కొట్టొద్దని ఏడుస్తూ, గాయాల నొప్పికి విలవిలలాడుతున్న వీడియో కూడా కనిపిస్తోంది. అతడు ఎంతగా వేడుకున్నా పోలీసులు మాత్రం తమ పనిని కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ ఘటనపై టెన్నెస్సి బ్యూరో ఆఫ్​ ఇన్​వెస్టిగేషన్ దర్యాప్తు మొదలుపెట్టింది. నికోలస్ మరణంతో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్​ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పోలీసుల అనుచిత ప్రవర్తన తనకు కోపం తెప్పించిందని అన్నారు. పోలీసులు అతడిపై దాడి చేస్తున్న దృశ్యాలు తాను చూశానని, అవి తనను బాధించాయని పేర్కొన్నారు.

 

Exit mobile version