NTV Telugu Site icon

BJP vs Congres : గాంధీభవన్‌ వద్ద ఉద్రిక్తత.. బీజేపీ శ్రేణులు అరెస్ట్‌

Gandhi Bhavan

Gandhi Bhavan

BJP vs Congres : తెలంగాణలో బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్‌ కార్యకర్తల దాడి తీవ్ర రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఈ ఘటనపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తూ, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడిని దురదృష్టకరంగా అభివర్ణిస్తూ, ప్రభుత్వ వైఫల్యాన్ని బహిర్గతం చేస్తున్నారు.

దాడి అనంతరం, బీజేపీ కార్యకర్తలు గాంధీభవన్‌ను ముట్టడించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. కానీ పోలీసులు అప్రమత్తమై బీజేపీ శ్రేణులను అడ్డుకోవడంతో, గాంధీభవన్ వైపుగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో, బీజేపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేస్తుండగా, పోలీసులు వారిని నియంత్రించేందుకు లాఠీచార్జ్ చేశారు. పలువురిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు, ఈ ఘటన తర్వాత బీజేపీ కార్యాలయం వద్ద అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు చేరుకుంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ పరిస్థితులపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన మాట్లాడుతూ, “బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్‌ కార్యకర్తల దాడి దురదృష్టకరమైన ఘటన. ఇది కాంగ్రెస్ పార్టీ అసహనాన్ని, బీఆర్ఎస్ తరహా విధానాలను ప్రతిబింబిస్తోంది. మేము కూడా ప్రతిగా ఇలానే ప్రవర్తిస్తే, మీ జాతీయ నాయకులు ఎక్కడికి దాక్కుంటారో?” అని ప్రశ్నించారు.

అదే సమయంలో, తెలంగాణలో అవినీతి విషయాలపై ఆయన తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. “కేటీఆర్ ఎంతకాలం తప్పించుకుని తిరుగుతారు? చంచల్‌గూడ జైలుకు వెళ్లాలా లేక తీహార్‌ జైలుకు వెళ్లాలా అనేది కేటీఆర్ నిర్ణయించుకోవాలి. కేసీఆర్ కుటుంబం లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడింది. ప్రజల డబ్బును దోచుకుని కోర్టుల్లో పిటిషన్లు వేస్తూ కాలయాపన చేస్తున్నారు. బీజేపీ మాత్రం తెలంగాణలో త్వరలో అధికారంలోకి వస్తుంది,” అని ధర్మపురి ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణలో పాలనపై కాంగ్రెస్‌, బీఆర్ఎస్ ప్రభుత్వాల విధానాలను విమర్శిస్తూ, బీజేపీ తన రాజకీయ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని స్పష్టంగా పేర్కొన్నారు.

Chandrababu and Pawan Kalyan Vizag Tour: రేపు మధ్యాహ్నం విశాఖకు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌..

Show comments