Site icon NTV Telugu

BJP: ఎన్నికల వేళ షాక్.. పోటీ నుంచి వైదొలిగిన అభ్యర్థులు

Gujrat

Gujrat

ఎన్నికల వేళ ఎవరైనా టికెట్లు రాకపోతే నానా యాగీ చేస్తారు… కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేసి భారీ హంగామా సృష్టిస్తారు. కానీ గుజరాత్‌ బీజేపీలో మాత్రం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. టికెట్లు లభించాక.. పోటీ నుంచి వైదొలిగి పార్టీకి ఝలక్ ఇచ్చారు.

గుజరాత్‌కు చెందిన ఇద్దరు బీజేపీ నేతలకు అధిష్టానం టికెట్లు ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు నేతలు ప్రకటించారు. వ్యక్తిగత కారణాల వల్ల తాము పోటీకి దూరమవుతున్నామని వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా పోస్టులు పెట్టారు. వడోదర సిట్టింగ్ ఎంపీ రంజన్ భట్‌కు బీజేపీ మరోసారి టికెట్ ఇచ్చింది. అలాగే సబర్‌కాంతా నుంచి భికాజీ ఠాకూర్‌కు టికెట్ ప్రకటించింది. ఇటీవలే వారి పేర్లను అధికారికంగా పార్టీ అధిష్టానం వెల్లడించింది. కానీ వారు మాత్రం అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకుని హైకమాండ్‌కు షాకిచ్చారు.

వడోదరలో రంజన్ భట్‌కు మరోసారి టికెట్ ఇవ్వడంపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అందుకు నిరసనగా నియోజకవర్గంలో బ్యానర్లు వెలిశాయి. 2014లో మోడీ.. వారణాసి, వడోదర నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. వారణాసి నుంచి కొనసాగాలని నిర్ణయించుకోవడంతో వడోదర ఖాళీ అయింది. అప్పుడు అక్కడ నిర్వహించిన ఉప ఎన్నికలో రంజన్ భట్ విజయం సాధించారు. 2019లో కూడా ఈ విజయం రిపీట్ అయింది. మరోసారి 2024 ఎన్నికల్లో కూడా వడోదర టికెట్ భట్‌కే కేటాయించారు. కానీ ఆమె మాత్రం పోటీ నుంచి తప్పుకున్నారు. అలాగే సబర్‌కాంతా నుంచి బరిలోకి దిగిన భికాజీ ఠాకూర్‌ కూడా వైదొలిగారు. వ్యక్తిగత కారణంతోనే అంటూ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే.. గుజరాత్‌లోని 26 లోక్‌సభ స్థానాలకు ఒకే దశలో మే 7న పోలింగ్‌ జరగనుంది. గత రెండుసార్లు అన్ని సీట్లు కమలం పార్టీ తన ఖాతాలో వేసుకుంది. మరోసారి అన్ని సీట్లు ఖాతాలో వేసుకోవాలని పువ్వు పార్టీ భావిస్తోంది.

ఇది కూడా చదవండి: Chris Gayle: ధోనీ కొన్ని మ్యాచ్లు ఆడరు..

ఇదిలా ఉంటే కర్ణాటకలో మాత్రం టికెట్లు రాక.. సీనియర్ నేతలు అలక బూనారు. మాజీ ముఖ్యమంత్రి సదానంద గౌడ్‌కు ఈసారి టికెట్ లభించలేదు. దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. కానీ గుజరాత్‌లో మాత్రం టికెట్లు లభించాక పోటీ నుంచి తప్పుకోవడం విశేషం.

 

Exit mobile version