Site icon NTV Telugu

Bandi Sanjay: రాష్ట్రంలో లీకేజీల జాతర.. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి..

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: రాష్ట్రంలో పదో తరగతి తెలుగు పేపర్ లీక్‌ కావడం అత్యంత దురదృష్టకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో పరీక్షల లీకేజీ సర్వసాధారణంగా మారినట్లు కన్పిస్తోందని ఆయన విమర్శించారు. తెలంగాణలో పరీక్షలు వస్తే లీకేజీల జాతర నడుస్తోందన్నారు. పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేని చేతగాని ప్రభుత్వం ఇంకా కొనసాగుతుండటం సిగ్గుచేటని బండి సంజయ్ మండిపడ్డారు.

ప్రభుత్వ చేతగానితనం విద్యార్థుల జీవితాలకు శాపంగా మారిందన్న ఆయన.. కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ యాజమాన్యాలకు ప్రభుత్వం తొత్తుగా మారి ఇలాంటి నీచపు చర్యలకు పాల్పడుతున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఈ లీకేజీతో ప్రభుత్వ, చిన్న చిన్న ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడిందన్నారు. టెక్నాలజీని పేపర్ లీకేజీ కోసం ఉపయోగించుకుంటున్నా నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పేపర్ లీకేజీకి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Read Also:SSC Paper Leak: పరీక్ష ప్రారంభమైన 7 నిమిషాలకే వాట్సాప్ గ్రూప్‌లో ప్రశ్నాపత్రం.. కేసు నమోదు

ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు విద్యార్థుల జీవితాలను దెబ్బతీస్తున్నాయని బండి సంజయ్ మండిపడ్డారు. టెన్త్ పరీక్షలు 90 శాతం సిలబస్‌తో ఒకే పేపర్ గా పరీక్ష నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో ఇప్పటికే ఒత్తిడి కన్పిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ లీకేజ్ ఘటనతో విద్యార్థుల్లో మరింత గందరగోళం నెలకొందని తెలిపారు. మిగిలిన పరీక్షలైనా ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు రాసేలా పకడ్బందీగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యార్థులంతా ఒత్తిడికి గురికాకుండా ధైర్యంగా పరీక్షలకు ప్రిపేర్ కావాలన్నారు. 10వ తరగతి తెలుగు పేపర్ లీకేజీపై న్యాయ నిపుణులతో చర్చించి విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ లీకేజీ వెనకాల ఎంతటి వారున్నా వదిలిపెట్టవద్దన్నారు. బాధ్యులైన వారందరినీ కఠినంగా శిక్షించాలన్నారు.

Exit mobile version