NTV Telugu Site icon

Manish Sisodia: ఎంసీడీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిని అంగీకరించాలి..

Manish Sisiodia

Manish Sisiodia

Manish Sisodia: ఎంసీడీ ఎన్నికల్లో ఓటమిని అంగీకరించాలని, మేయర్ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మంగళవారం బీజేపీని కోరారు. కొందరు కౌన్సిలర్ల నిరసనల మధ్య మేయర్, డిప్యూటీ మేయర్‌లను ఎన్నుకోకుండానే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) సభ మంగళవారం వాయిదా పడింది. మేయర్ ఎన్నిక నుంచి బీజేపీ పారిపోయిందని ఆయన ఆరోపించారు. ప్రతి ఒక్కరూ బీజేపీ నాటకాన్ని చూశారని ఆయన అన్నారు. బీజేపీ పాలనతో ప్రజలు విసుగు చెందారని.. వారి పాలనలో చెత్త గుట్టలుగా పేరుకుపోయిందని, మొత్తం రాజధానిని నాశనం చేశారని విమర్శించారు.

మొదట వారు మున్సిపల్ ఎన్నికలకు దూరంగా ఉన్నారని.. ఇప్పుడు మేయర్ ఎన్నికల నుంచి పారిపోతున్నారని ఆయన అన్నారు. బీజేపీ “భాగి జనతా పార్టీ”గా మారిందని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై విశ్వాసం ఉంటే ఎంసీడీ ఎన్నికల్లో తమ ఓటమిని అంగీకరించి మేయర్‌ ఎన్నిక సజావుగా జరిగేలా చూసుకోవాలని ఆయన అన్నారు.ఎంసీడీ హౌస్‌ను తిరిగి సమావేశపరచాలని, మేయర్ ఎన్నికను ఈరోజే నిర్వహించాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. రాజ్యాంగ విరుద్ధమైన రీతిలో ఎంసీడీని తన ఆధీనంలో ఉంచుకునేందుకు బీజేపీ ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతోందని ఆరోపించారు.

Egypt President: రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా భారత్‌కు విచ్చేసిన ఈజిప్ట్ ప్రెసిడెంట్

మేయర్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడంతో సభను వాయిదా వేసుకున్నారని, ఈరోజే ఎన్నికల సమయాన్ని ఎల్జీ నిర్ణయించాలని ఆప్ సీనియర్ నేత సంజయ్ సింగ్ అన్నారు. ఆప్‌కు 151 మంది కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీల మద్దతు ఉండగా, బీజేపీకి 111 మంది కార్పొరేటర్లు, ఎంపీల మద్దతు మాత్రమే ఉంది. ఎన్నికల్లో గెలవకపోతే గెలిచే పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయనివ్వబోమని బీజేపీ ప్రమాదకరమైన ధోరణిని ప్రారంభించిందని అన్నారు. కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి, మాజీ ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ సమక్షంలో ఆప్ మహిళా కౌన్సిలర్లపై బీజేపీ కౌన్సిలర్లు దాడి చేశారని ఆయన ఆరోపించారు.