BJP: కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని విజయాలను ప్రజలకు వివరించేందుకు బీజేపీ మరో ముందడుగు వేసింది. ప్రధాని ప్రజలకు చేసిన సేవలను వివరించి మరోసారి దీవించాలని, ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ ‘మహాజన్ సంపర్క్ అభియాన్’ పేరిట దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. అందులో భాగంగా మంగళవారం నుంచి జూన్ 30వ తేదీ వరకు నెలరోజుల పాటు పలు కార్యక్రమాలను చేపట్టనుంది. ఈ మహాజన్ సంపర్క్ అభియాన్ కింద అన్ని జిల్లాలు, మండలాలు, శక్తి కేంద్రాలు, బూత్‌లు, అన్ని లోక్ సభ నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా 51 భారీ బహిరంగ సభలు నిర్వహించాలని బీజేపీ పార్టీ నిర్ణయించుకుంది. అంతేకాకుండా లోక్‌సభ స్థాయిలో మొత్తం 396 సభలు నిర్వహించాలని డిసైడ్ అయింది.
Read Also: Bengaluru Traffic: లంచ్ @ ట్రాఫిక్ జామ్.. వీడియో వైరల్
దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా 51 బహిరంగ సభలు నిర్వహించనుండగా.. తెలంగాణలోనే రెండు సభలు ఉండనున్నాయి. జన్ సంపర్క్ అభియాన్ సన్నాహకాల కోసం ఇప్పటికే రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి కార్యవర్గ సమావేశాలను బీజేపీ నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం దేశ వ్యాప్తంగా 117 క్లస్టర్ బృందాలను నియమించింది. రాష్ట్రంలో ఏడుగురు సభ్యులు, జిల్లా స్థాయిలో ఆరుగురు, మండల స్థాయిలో నలుగురు సభ్యులతో కమిటీలను ఏర్పాటుచేయాలని అధిష్ఠానం ఆదేశించింది. ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర స్థాయి కమిటీని నియమించింది. తొమ్మిదేండ్ల మోడీ పాలనలో సాధించిన విజయాలపై ప్రజలకు వివరించి బీజేపీ వైపు ఆకర్షితులను చేసేలా కార్యాచరణ రూపొందించుకుంది.