Bypoll Elections: అభ్యర్థుల మార్పే ముంచేసిందా..? బీజేపీ వ్యూహం ఎక్కడ తిరగబడింది..?

Jan Suraaj Party

Jan Suraaj Party

బిహార్‌లోని బకీంపూర్, మధ్యప్రదేశ్‌లోని దతియా అసెంబ్లీ నియోజకవర్గాల్లో చోటుచేసుకున్న ఉపఎన్నికల ఓటములు భారతీయ జనతా పార్టీకి  తీవ్ర రాజకీయ ప్రతికూలతను తెచ్చిపెట్టాయి. వరుసగా రెండు వారాల వ్యవధిలోనే పేపర్ లీకేజీ నిరసనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం, ఇప్పుడు సొంత పాలనలో ఉన్న రెండు కీలక రాష్ట్రాల ఉపఎన్నికల్లో ఓడిపోవడం పార్టీ నాయకత్వాన్ని ఆత్మపరిశీలనలో పడేసింది. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీలకే ఉపఎన్నికల్లో సానుకూల ఫలితాలు వస్తుంటాయి. గుజరాత్‌లోని మంజల్‌పూర్‌లో భాజపా భారీ మెజారిటీతో గెలిచినప్పటికీ.. బకీంపూర్, దతియా స్థానాల్లో ఎదురైన పరాభవం మాత్రం పార్టీ బలహీనతలను స్పష్టంగా ఎత్తిచూపుతోంది.

ముఖ్యంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ గతంలో ప్రాతినిధ్యం వహించిన, 50 వేల‌కు పైగా మెజారిటీ ఉన్న బీజేపీ దశాబ్దాల కోట బకీంపూర్‌లో జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ చేతిలో ఎదురైన ఓటమి అత్యంత నష్టదాయకంగా మారింది. ప్రశాంత్ కిశోర్ ఈ గెలుపుతో తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టడమే కాకుండా..  బీజేపీ సాంప్రదాయ అగ్రవర్ణ ఓటు బ్యాంకులో స్పష్టమైన చీలిక తీసుకురాగలిగారు. ఆర్‌జేడీ తన కోర్ ఓట్లను కిశోర్‌కు బదిలీ చేయడం వల్లనే ఈ ఫలితం వచ్చిందని బీజేపీ ఆరోపిస్తున్నప్పటికీ.. నీట్ పేపర్ లీకేజీ నిరసనలు, యూజీసీ మార్గదర్శకాలు, పోలీస్ చర్యలపై యువత, విద్యార్థుల్లో వ్యక్తమైన తీవ్ర అసంతృప్తి ఓటింగ్ శాతం తగ్గడానికి, పార్టీ సాంప్రదాయ ఓటర్లు దూరమవ్వడానికి కారణమయ్యాయి. స్థానిక నేతలను మార్చడం, ఓటర్లను తక్కువగా అంచనా వేయడం కూడా ప్రతికూలంగా మారింది.

మరోవైపు.. మధ్యప్రదేశ్‌లోని దతియా స్థానంలో కాంగ్రెస్ తన నియోజకవర్గాన్ని నిలబెట్టుకోవడంతో ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ వర్గానికి రాజకీయ ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంది. ఈ ఓటమికి టికెట్ దక్కక అసంతృప్తి వ్యక్తం చేసిన మాజీ మంత్రి నరోత్తమ్ మిశ్రా వర్గ విభేదాలు, అభ్యర్థి ఎంపికలో జరిగిన పొరపాట్లే ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్గత పోరు, విద్యార్థుల నిరసనలు, ఓటర్ల అసంతృప్తి కలిసికట్టుగా భాజపా సంప్రదాయ స్థానాలకు గండికొట్టాయి. ఈ ఓటములతో అటు ప్రభుత్వం, ఇటు పార్టీ సంస్థాగత నిర్మాణంలో మున్ముందు కీలక మార్పులు చోటుచేసుకునే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.